రూ.3 ల‌క్ష‌ల కోట్లు పెరిగిన కరెన్సీ చెలామ‌ణి  

ఈ ఆర్థిక సంవ‌త్స‌రం తొలి 9 నెల‌లలో దేశంలో చెలామ‌ణిలో ఉన్న క‌రెన్సీ (క‌రెన్సీ ఇన్ స‌ర్క్యులేష‌న్ (సీఐసీ)) ఏకంగా 13 శాతం పెరిగిన‌ట్లు ఆర్బీఐ తాజా డేటా వెల్ల‌డించింది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌జ‌లు ముందు జాగ్ర‌త్త‌గా న‌గ‌దును ద‌గ్గ‌ర పెట్టుకోవ‌డం వ‌ల్లే సీఐసీ భారీగా పెరిగింది. 
 
2020, మార్చి 31వ‌తేదీన చెలామ‌ణిలో ఉన్న క‌రెన్సీ మొత్తం విలువ రూ.24,47,312 కోట్లు కాగా.. అది జ‌న‌వ‌రి, 2021 నాటికి రూ.3, 23,003 కోట్లు పెరిగి రూ.27,70,315 కోట్ల‌కు చేరిన‌ట్లు ఆర్బీఐ డేటా వెల్ల‌డించింది. 
 
లాక్‌డౌన్‌లో ఏదైనా అత్య‌వ‌స‌ర వినియోగం కోసమంటూ ప్ర‌జ‌లు ఇళ్ల‌లో న‌గ‌దును ఎక్కువ‌గా ఉంచుకోవ‌డం వ‌ల్లే ఈ ప‌రిస్థితి త‌లెత్తింద‌ని కేర్ రేటింగ్స్ చీఫ్ ఎక‌న‌మిస్ట్ మ‌ద‌న్ స‌బ్న‌వీస్ చెప్పారు. ఇలాంటి సంక్షోభ స‌మ‌యాల్లో న‌గదుపైనే ఆధార‌ప‌డ‌టం సాధార‌ణ‌మేన‌ని ఆయ‌న చెప్పారు. 
 
క‌రెన్సీకి డిమాండ్ పెర‌గ‌డంతో ఆర్బీఐ కూడా అందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకున్న‌ది. చెలామ‌ణిలో ఉన్న క‌రెన్సీ అంటే అందులో బ్యాంకు నోట్లు, నాణేలు కూడా క‌లిపి ఉంటాయి. 2020 ఆర్థిక సంవత్స‌రంలో చెలామ‌ణిలో ఉన్న బ్యాంకు నోట్ల విలువ 14.7 శాతం పెరిగిన‌ట్లు ఆర్బీఐ వెల్ల‌డించింది. ఇందులో రూ.500, రూ.2000 నోట్లే 83.4 శాతం ఉండ‌టం విశేషం.