వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని వ్యతిరేకిస్తూ ఈ ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్‌తోపాటు దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌పై నిషేధం విధించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ) డిమాండ్ చేసింది. ఈ కొత్త పాలసీతో యూజర్లకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం, పేమెంట్ లావాదేవీలు, కాంటాక్ట్‌లు, లొకేషన్‌తోపాటు ఇతర కీలక సమాచారాన్ని వాట్సాప్ సేకరించి తన మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు అందించనుంది.
అయితే ఇది దేశ భద్రతకే ముప్పు అంటూ సీఏఐటీ కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు లేఖ రాసింది. ఈ కొత్త ప్రైవసీ పాలసీ అమలు కాకుండా చూడటం లేదా వాట్సాప్, ఫేస్‌బుక్‌లను భారత్ లో నిషేధించడం చేయాలని ఆ లేఖలో సీఏఐటీ డిమాండ్ చేసింది. ఫేస్‌బుక్‌కు భారత్ లో 20 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.
వీళ్ల డేటా అంతా ఫేస్‌బుక్ చేతుల్లో ఉండటం దేశ ఆర్థిక వ్యవస్థకే కాదు భద్రతకు కూడా ముప్పు అని ట్రేడర్స్ వాదిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఒకప్పుడు ఉప్పు వ్యాపారం చేస్తామంటూ దేశంలోకి చొరబడిన ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారం గుర్తొస్తున్నదంటూ సీఏఐటీ ఆ లేఖలో పేర్కొన్నది.
దేశ ఆర్థిక వ్యవస్థకు డేటా ఎంతో కీలకమైనదని, అలాంటి డేటాను చోరీ చేస్తామని చెప్పి వాట్సాప్, ఫేస్‌బుక్ తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నాయని విమర్శించింది. భారత రాజ్యాంగ ప్రాథమిక స్ఫూర్తికి ఇది విరుద్ధమని, ఇది వ్యక్తి ప్రైవసీపై దాడి చేయడమే అవుతుందని ఆరోపించింది. వెంటనే ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకోవాలని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భార్తియా డిమాండ్ చేశారు.
More Stories
లోకాయుక్త విచారణకు హాజరైన సిద్దరామయ్య
సిమ్ లేకుండానే బీఎస్ఎన్ఎల్ వినూత్న సేవలు!
సీఎం సిద్దరామయ్యకు లోకాయుక్త పోలీసులు సమన్లు