రికార్డు స్థాయిలో ఐటి రిటర్న్‌లు  

వ్యక్తిగత ఐటి రిటర్న్ దాఖలుకు చివరి రోజయిన ఆదివారం నాడు రికార్డు స్థాయిలో రిటర్న్‌లు దాఖలయ్యాయి. ఆదివారం ఆరు గంటల సమయానికి 17,97,625 ఐటి రిటర్న్‌లు దాఖలయ్యాయి. 

చివరి ఒక గంటలోనే 2,39,013 రిటర్న్‌లు దాఖలయ్యాయంటే రిటర్న్‌లు దాఖలు చేయడానికి జనం ఎంతగా ఎగబడ్డారో అర్థమవుతుంది. ఆదివారం నాలుగు గంటల వరకు 13,29,317 రిటర్న్‌లు దాఖలయ్యాయని, చివరి ఒక గంటలో 2,07,108 రిటర్న్‌లు దాఖలయ్యాయని ఆదాయం పన్ను విభాగం ఒక ట్వీట్‌లో తెలియజేసింది. 

అంతేకాదు, ఏ సహాయానికయినా తమ వెబ్‌సైట్‌కు కనెక్ట్ కావాలని, సంతోషంగా సాయం అందిస్తామని కూడా ఆ ట్వీట్‌లో పేర్కొంది. 2019 20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జనవరి 7వ తేదీ వరకు 5.27 కోట్లకు పైగా ఆదాయం పన్ను రిటర్న్‌లు దాఖలయ్యాయి. 

కేంద్ర ప్రభుత్వం ఆదాయం పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి వ్యక్తులకు జనవరి 10 వరకు, కంపెనీలకు ఫిబ్రవరి 15 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.