అజ్ఞాతంలోకి సినీనటి రాధికా కుమారస్వామి!  

అజ్ఞాతంలోకి సినీనటి రాధికా కుమారస్వామి!  
ప్రముఖ కన్నడ సినీనటి రాధికా కుమారస్వామి అజ్ఞాతంలోకి వెళ్లారన్న కధనాలు కన్నడనాట కలకలం రేపుతున్నాయి. కన్నడ, తెలుగుతోపాటు పలు ప్రాంతీయ భాషల సినిమాల్లో నటించిన రాధిక తనకంటే వయసులో ఎంతో పెద్దవాడైన మాజీ ప్రధాన తనయుడు దేవెగౌడ కొడుకు, మాజీ సీఎం కుమారస్వామిని పెళ్లి చేసుకోవడం ఇదివరలో సంచలనం రేపింది. 
 
పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాల్లో నటిస్తున్నారు. ఆమెకు పోలీసులు అరెస్టు చేసిన మోసగాడితో సంబంధాలున్నాయన్న వ్యవహారం సంచలనం రేపింది. ఇవేవీ పట్టించుకోకుండా ఆమె నేరుగా శుక్రవారం రాత్రి బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరై, ఆ తర్వాత ఎక్కడున్నారో తెలియకపోవడం కలకలం రేపుతున్నది. 
 
 జ్యోతిష్యుడినని, ప్రముఖులతో సంబంధాలున్నాయని చెప్పుకుని ఉద్యోగాలిప్పిస్తానంటూ అనేక మందిని మోసం చేసిన 52 ఏళ్ల యువరాజ్ అలియాస్ స్వామితో సంబంధాలపై బలమైన ఆధారాలున్నాయని పోలీసులు ప్రకటించిన నేపధ్యంలో ఆమె విచారణకు హాజరుకావడం గమనార్హం. 
 
ఉద్యోగాల పేరుతో అనేక మందిని మోసం చేసి డబ్బులు వసూలు చేసిన యువరాజ్ రూ.75 లక్షల నగదును రాధికా కుమారస్వామి ఖాతాలో వేసినట్లు బెంగళూరు క్రైమ్ బ్రాంచి పోలీసులు చెబుతున్నారు. 
 
గత డిసెంబర్ 16న యువరాజ్ అలియాస్ స్వామిని అరెస్టు చేసిన అనంతరం పోలీసులు అతని ఇంట్లో జరిపిన సోదాల్లో రూ  91 కోట్ల లావాదేవీలకు సంబంధించిన 100కు పైగా చెక్కులు దొరికాయి. లాక్ డౌన్ కు ముందు ఫిబ్రవరి, మార్చి నెలల్లో యువరాజ్ అలియాస్ స్వామి రెండు విడుతలుగా రూ 75 లక్షలు రాధికా కుమారస్వామి ఖాతాలో వేశాడు. 
 
ఈ లావాదేవీల గురించి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రశ్నించగా, తాను తీయబోతున్న సినిమాలో తాను ఒక ప్రధానపాత్ర వేయడం కోసం డబ్బిచ్చాడని రాధికా కుమారస్వామి బదులిచ్చారట. అయితే తీయబోయే సినిమాకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేదా ఒప్పందం వంటివి ఏవీ ఆమె చూపించలేదని పోలీసులు చెబుతున్నారు. 
 

స్వామి తనకు 17 ఏళ్లుగా తెలుసునని రాధిక  చెప్పిందట. జ్యోతిష్యుడిగా తన . కెరీర్.. పెళ్లి.. తన తండ్రి అనారోగ్యం.. చావులతోపాటు అనేక విషయాల్లో ముందే చెప్పడంతో యువరాజు అలియాస్ స్వామిపై తనకు చాలా నమ్మకం, గురి ఉన్నాయని..,  అలాంటి వ్యక్తి ఛీటింగ్ కేసులో అరెస్టు కావడం షాక్ గురిచేసినట్లు పోలీసులకు తెలియజేసింది.

మరోసారి విచారణకు పిలిచినప్పుడు రావాలంటూ ఆమెను బెంగళూరు పోలీసులు పంపించివేశారు. అలాగే తమకు సమాచారం ఇవ్వకుండా బెంగళూరు నగరం దాటి వెళ్లకూడదని పోలీసులు ఆంక్షలు పెట్టడంతో ఆమె సరేనంటూ వెళ్లినట్లు తెలిసింది. 

 పోలీసుల విచారణ నుండి ఇంటికొచ్చిన రాధిక ఆ తర్వాత ఇంట్లో నుంచి గుర్తు తెలియని చోటకు వెళ్లిపోవడంతో ఆమె అజ్ఞాతంకు వెళ్లిపోయందని ప్రచారం జరుగుతోంది. పోలీసుల ఆంక్షల నేపధ్యంలో ఆమె బెంగళూరులో నగర  పరిధిలోనే తన సన్నిహితుల ఇంట్లో తలదాచుకుంటున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది.