కేంద్రం వద్దని చెప్పినా కుర్చీ వదలని సింగరేణి ఎండి 

సింగరేణి సీఎండీగా  ఎన్​. శ్రీధర్​ను కొనసాగించేందుకు కేంద్రం  విముఖత వ్యక్తం చేసినా ఆయన మాత్రం తన కుర్చీ దిగట్లేదు. ఇటీవల కొత్తగూడెంలోని కంపెనీ హెడ్డాఫీస్​లో  జరిగిన వార్షిక​ జనరల్​ బాడీ మీటింగ్ లో  శ్రీధర్​ కొనసాగింపు​ కోసం పెట్టిన తీర్మానాన్ని కేంద్ర బావొగ్గు గనుల మంత్రిత్వ  ప్రతినిధి వ్యతిరేకించారు. 
 
 సీఎండీగా శ్రీధర్​ను కొనసాగించడం కేంద్రానికి ఇష్టం లేదని స్పష్టంగా చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సాయంతో సాధారణ తీర్మానాన్ని ఆమోదింప చేసుకొని పదవిలో కొనసాగుతున్నారు.  నిబంధనలకు వ్యతిరేకంగా పెట్టిన ఈ తీర్మానం చెల్లదని నిపుణుల స్పష్టం చేస్తున్నారు. 
వాస్తవానికి సీఎండీని కొనసాగించాలి అంటే ప్రత్యేక తీర్మానం  ​పెట్టాలి. అది నెగ్గాలంటే అనుకూలంగా 70శాతం ఓట్లు పడాలి. కేంద్రం వాటా 49 శాతం కావడంతో, బొగ్గు గనుల మంత్రిత్వ ప్రతినిధి అంతే శాతం ఓట్లతో సమానమైనందున తీర్మానం వీగిపోయినట్లేనని నిపుణులు ​ చెబుతున్నారు. 
 
ఒకవేళ ప్రత్యేక తీర్మానం సాధారణ తీర్మానంగా మార్చాలంటే14 రోజుల ముందే బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ నుంచి ఆమోదం తీసుకోవాలి. కానీ ఎలాంటి ఆమోదం లేకుండా పెట్టిన సాధారణ తీర్మానంను  కూడా ప్రత్యేక తీర్మానం​గానే భావించి సీఎండీ దిగిపోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.  
 
అదీగాక ట్రైపార్టెడ్​ అగ్రిమెంట్​ ప్రకారం సీఎండీని కొనసాగించాలాంటే కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తప్పనిసరి కాగలదు.  ఇలా  సింగరేణి చరిత్రలో ఓ సీఎండీ కొనసాగింపునకు వ్యతిరేకంగా బొగ్గు గనుల ప్రతినిధి తొలిసారి ఓటేసినా శ్రీధర్​ మాత్రం​పదవిలో కొనసాగడంపై విమర్శలు వస్తున్నాయి.
 
2015 జనవరి 1న సింగరేణి సీఎండీగా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్ పదవీకాలం నిజానికి 2016 డిసెంబర్ 31నే ముగిసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒకసారి రెండేళ్లకు,  రెండుసార్లు ఏడాది చొప్పున కొనసాగిస్తూ వచ్చింది. ఐదేళ్లకు మించి ఈ పదవిలో ఉండరాదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. 
 
శ్రీధర్​ ఇప్పటికే  సీఎండీ పదవిలో  ఆరేళ్లపాటు కొనసాగినా, తాజాగా మరోసారి కొనసాగింపు ​ ఇవ్వడాన్ని  కార్మిక సంఘాల నేతలు తప్పుపడుతున్నారు. కాగా, సీఎండీ శ్రీధర్​ అధికారపార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు కొంతకాలంగా వస్తున్నాయి.  
తెలంగాణ జెన్​కో, ట్రాన్స్​కో నుంచి కంపెనీకి రూ 10వేల కోట్లకు పైగా బకాయిలు​ రావాల్సి ఉన్నా, వాటిని రాష్ట్రప్రభుత్వం నుంచి ఇప్పించడంలో శ్రీధర్​ విఫలమయ్యారనే విమర్శలున్నాయి. 
 
డీఎంఎఫ్​టీ పేరిట సుమారు రూ.2వేల కోట్లకు పైగా నిధులను రాష్ట్ర ఖజనాకు మళ్లించారని, తద్వారా కంపెనీకి లాభాలు, దాంతోపాటు తమ వాటాలు తగ్గిపోయాయని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  కొంతకాలంగా కంపెనీలో డీజిల్​, ఓబీ కుంభకోణాలు, ఇతరత్రా అవినీతి, అక్రమాలు వెలుగుచూడడంతో కేంద్రం కూడా శ్రీధర్​ పనితీరుపై  తీవ్ర అసంతృప్తితో ఉంది.