అరేబియా సముద్రగర్భం గుండా నేరుగా భారత్ పైప్‌లైన్

అరేబియా సముద్రగర్భం గుండా నేరుగా భారత్ పైప్‌లైన్

పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) లో నిరంతరం కొనసాగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు భారతదేశ ఇంధన భద్రతకు పెద్ద సవాలుగా మారాయి. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి పరిసరాల్లో ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారీ దేశీయంగా చమురు సంక్షోభం తలెత్తే ముప్పు పొంచి ఉంది. ఈ ఆందోళనలను అధిగమించడానికి, హర్మూజ్ జలసంధితో సంబంధం లేకుండా అరేబియా సముద్రగర్భం గుండా నేరుగా పైప్‌లైన్ నిర్మించే వ్యూహాత్మక మాస్టర్ ప్లాన్‌ను భారత్ వేగవంతం చేస్తోంది.

ఈ సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయంగా ‘సౌత్ ఆసియా గ్యాస్ ఎంటర్‌ప్రైజ్’   (సెజ్) ఆధ్వర్యంలోప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. సుమారు రూ. 40,000 కోట్ల ($4.7 to $4.8 బిలియన్లు) అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా ఒమన్‌ నుండి నేరుగా భారతదేశంలోని గుజరాత్‌కు కనెక్టివిటీని ఏర్పాటు చేస్తారు. దాదాపు 2,000 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ సముద్రగర్భ పైప్‌లైన్ ద్వారా రోజుకు సుమారు 31 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను రవాణా చేయవచ్చు. 

దీని ద్వారా యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాన్, ఖతార్ వంటి ఆరు గల్ఫ్ దేశాల గ్యాస్ నిల్వలను నేరుగా భారత్‌కు అనుసంధానించవచ్చు. ఈ పైప్‌లైన్ రూట్ ప్రపంచంలోనే అత్యంత లోతైనదిగా రికార్డు సృష్టించనుంది. దీనిని సముద్ర మట్టానికి ఏకంగా 3,450 మీటర్ల లోతులో నిర్మించాల్సి ఉంటుంది. 

అంతటి అగాధంలో పైప్‌లైన్ వేయడం ఇంజనీరింగ్ పరంగా అతిపెద్ద సవాలు అయినప్పటికీ, `సెజ్’ సంస్థ ఇప్పటికే 3 కిలోమీటర్ల పొడవైన టెస్టింగ్ పైప్‌లైన్‌ను విజయవంతంగా పరీక్షించింది. ప్రస్తుతం దేశంలో గ్యాస్ డిమాండ్ రోజుకు సుమారు 190-195 mmscmd గా ఉండగా, అది 2030 నాటికి 300 mmscmd కి పెరగొచ్చని అంచనా. ఈ భారీ వ్యత్యాసాన్ని భర్తీ చేయడానికి కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ గెయిల్, ఇంజనీర్స్ ఇండియా, ఐఓసీ సంస్థలను ఈ ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది.