మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు , తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీకి కోల్‌కతాలో 43 అక్రమ ఆస్తులు ఉన్నాయని బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఒక జాబితాను కూడా విడుదల చేసింది. ఈ ఆస్తులలో చాలా వరకు ఆయన సహాయకులు, కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్మడిగా ఉన్నాయని కూడా బీజేపీ ఆరోపించింది. దీనిపై సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం సమగ్ర విచారణ జరుపుతుందని వర్గాలు తెలిపాయి.
అయితే, ఈ ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. కేవలం రాజకీయ ప్రేరేపిత ఆరోపణలని మండిపడింది. అక్రమ నిర్మాణాలు జరిగాయని అభిషేక్‌కు సంబంధించిన కొన్ని చిరునామాలకు కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (కెఎంసి) నోటీసులు పంపడంతో ఈ వివాదం ముదిరింది. అభిషేక్‌కు సంబంధించిన 17 ఆస్తులకు నోటీసులు పంపారు.
ఈ జాబితాలో పేరు ఉన్న తృణమూల్ ఎంపీ సయోని ఘోష్ తనకు వీటితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ జాబితాలో ‘సయోని ఘోష్’ పేరుతో ఉమ్మడి ఆస్తి కూడా ఉంది. జాదవ్‌పూర్ ఎంపీ సయోని ఘోష్‌దేనని ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలతో తనను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు.
బీజేపీ విడుదల చేసిన జాబితా ప్రకారం కోల్‌కతాలోని విలాసవంతమైన ప్రాంతాలలోని ఈ 43 ఆస్తులు ఉమ్మడి యాజమాన్యం లేదా అభిషేక్ బెనర్జీ పేరు మీద ఉన్నాయి. కానీ, వాటిలో ఆయనవేనా? కాదా? అని స్పష్టంగా పేర్కొనకపోవడం గమనార్హం. యజమానుల మొబైల్ నంబర్లు కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన అఫిడవిట్‌లో రూ. 2.3 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ. 1.4 కోట్ల వార్షిక ఆదాయాన్ని ప్రకటించారు.
ఈ అడ్రస్‌లలో హరీష్ ముఖర్జీ రోడ్డులోని ఆయన నివాసం ‘శాంతినికేతన్’ కూడా ఉంది. ఈ జాబితాను కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ డేటాబేస్ నుంచి సేకరించారు.
భవన ప్రణాళిక ఆమోదం, అదనంగా లిఫ్టులు, ఎస్కలేటర్లు మొదలైన వాటి ఏర్పాటు వివరాలను కూడా కేఎంసీ కోరింది. ఏడు రోజుల్లోగా అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశించింది. ఈ ఆస్తుల అసలు యజమానులు ఎవరనే దానిపైనా బీజేపీ ప్రభుత్వం విచారణ జరుపుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదిలా ఉండగా, ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత బిజేపీ తమను లక్ష్యంగా చేసుకుంటోందని, ఇదంతా రాజకీయ ప్రచారంలో భాగమని టీఎంసీ ఆరోపించింది. బీజేపీ తప్పుడు కథనాలను ప్రచారం చేసే బదులు, వాస్తవాలను ధ్రువీకరించుకుని, వాటి ప్రామాణికతను నిర్ధారించుకోవాలని టీఎంసీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
అయితే, అభిషేక్‌ను లక్ష్యంగా చేసుకుని, ‘అవినీతిపరులందరినీ’ జైలుకు పంపుతామని ముఖ్యమంత్రి సువేందు అధికారి హెచ్చరించారు. అభిషేక్‌కు చెందిన 14 ఆస్తులు ఆయన ‘లీప్స్ అండ్ బౌండ్స్’ కంపెనీ పేరు మీద నమోదై ఉన్నాయని అధికారి ఆరోపించారు. దీనికి అభిషేక్ కౌంటర్ ఇస్తూ తన ఇంటిని ప్రభుత్వం కూల్చివేసినా తలవంచబోనని స్పష్టం చేశారు.

More Stories
సిఎఎ పరిధిలోకి రాని ప్రతి ఒక్కరూ చొరబాటుదారులే
అరేబియా సముద్రగర్భం గుండా నేరుగా భారత్ పైప్‌లైన్
భారత్- ఇటలీ మధ్య `ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’