వాట్సాప్‌కు సిగ్న‌ల్‌ యాప్‌ సవాల్‌  

ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది వినియోగదారులతో తిరుగులేకుండా ఆధిపత్యాన్ని సాధించిన వాట్సాప్‌కు సిగ్న‌ల్‌ యాప్‌ సవాల్‌ విసురుతోంది. ఆ యాప్‌ ఇప్పటికే ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజింగ్‌ యాప్‌గా పేరుగాంచింది. వాట్సాప్‌ ఫీచర్లతో పాటుగా ప్రైవసీ ఇంపార్టెంట్‌తో ప్రపంచ నెటిజన్లను ఆకట్టుకుంటూ, వాట్సాప్‌కు గట్టిపోటీనిస్తూ సిగ్న‌ల్‌ యాప్‌ జోరుగా దూసుకుపోతోంది. 
రెండు రోజుల్లో లక్షమంది యూజర్లు సిగ్న‌ల్‌ కు జత అయ్యారు. భారత దేశంలో డిసెంబర్‌ చివరివారంతో పోలిస్తే జనవరి మొదటివారంలో సిగ్న‌ల్‌ యాప్‌ డౌన్‌లోడ్లలో 79 శాతం మెరుగుదల ఉంది. మరోవైపు వాట్సప్‌ డౌన్‌లోడ్లలో గత వారం రోజుల్లో 11 శాతం క్షీణత కనిపిస్తోంది.

వాట్సాప్‌ కొత్తగా ప్రవేశపెట్టిన అప్‌డేటెడ్‌ పాలసీ పట్ల ఆసక్తి లేని యూజర్లు సిగ్న‌ల్‌ యాప్‌ ను ఆహ్వానిస్తున్నారు. వినియోగదారుల డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకునేలా తీసుకొచ్చిన వాట్సాప్‌ అప్‌డేట్‌ పాలసీపై వ్యతిరేకతే ఇప్పుడు సిగ్న‌ల్‌ యాప్‌ కు ఆదరణ పెరగడానికి కారణమని తెలుస్తోంది. 
 ‘సే హెలో టు ప్రైవసీ’ అన్న టాగ్‌లైన్‌తో ఉండే సిగ్న‌ల్‌ యాప్ యూజర్ల డేటా ప్రైవసీ కి పెద్దపీట వేస్తుందని.. అందుకే ఆదరిస్తున్నామని వినియోగదారులు చెబుతున్నారు.

సిగ్న‌ల్‌ ఫౌండేషన్‌ అండ్‌ సిగ్న‌ల్‌ మెసెంజర్‌ ఎల్‌ఎల్‌సి 2014 లో ఈ సిగ్న‌ల్‌ యాప్‌ ను అభివృద్ధి చేసింది. వాట్సాప్‌ సహ వ్యవస్థాపకుడు బ్రియాన్‌ యాక్షన్‌ ఈ సంస్థను నెలకొల్పారు. సిగల్‌ ఫౌండేషన్‌ అనే నాన్‌ ప్రాఫిట్‌ కంపెనీకి సొంతమైన ఈ సిగల్‌ యాప్‌ను మాక్సీ సృష్టించారు.

వాట్సాప్‌ తన కొత్త ప్రైవసీ పాలసీని పరిచయం చేసిన తర్వాత.. ప్రపంచ సంపన్నుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ‘సిగ్న‌ల్‌ ‌’కు ప్రచారాన్ని కల్పించారు. ”సిగ్న‌ల్‌ ‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోండి” అంటూ ట్విటర్‌ వేదికగా 4.15 కోట్ల మంది ఫాలోవర్లకు ఆయన సందేశమిచ్చారు. దీంతో సిగ్న‌ల్‌ డౌన్‌లోడ్లు జోరందుకున్నాయి. సిగ్న‌ల్‌ యాప్‌ అన్ని ప్లాట్‌ఫారాలపై వేగంగా దూసుకుపోతోంది.

సిగ్న‌ల్‌ యాప్‌లోని ప్రత్యేకతలేమిటంటే మామూలు మొబైల్‌ కాల్‌ తరహాలో సిగ్న‌ల్‌ యాప్‌లో వాయిస్‌ కాల్‌ ఫుల్‌ క్లారిటీ ఉంటుంది. ఐపి అడ్రస్‌ కూడా ఎవరికీ తెలియకూడదని భావించినప్పడు  రిలే కాల్స్‌ ఫీచర్‌ను వాడుకోవచ్చు. అంటే సిగ్న‌ల్‌ యాప్‌ సర్వర్ల ద్వారా కాల్స్‌ వెళతాయన్నమాట. ఈ ఆప్షన్‌ ఉపయోగించినప్పుడు వాయిస్‌ క్వాలిటీ కొంత తగ్గుతుంది. 

 
వీడియో కాల్‌ సౌకర్యం కూడా ఉంది. సిగ్న‌ల్‌ యాప్‌ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, విండోస్‌, మాక్‌, లైనెక్స్‌ తదితర ఆపరేటింగ్‌ సిస్టమ్‌లలోనూ పనిచేస్తుంది. గ్రూప్స్‌ కూడా పెట్టుకోవచ్చు. గ్రూప్‌ వీడియో కాలింగ్‌ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. మెసేజ్‌కు ఎమోజీ ద్వారా రిప్లరు ఇవ్వొచ్చు. డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌, డిసప్పియరింగ్‌ మెసేజ్‌ ఫీచర్లు కూడా ఉన్నాయి.

కాగా, వినియోగదారుల మెసేజెస్‌కు పూర్తి ప్రైవసీ ఉంటుందని, పర్సనల్‌ చాట్స్‌ విషయంలో ఇంతకుముందున్న పాలసీనే ఇప్పుడూ కొనసాగుతుందని వాట్సాప్‌ స్పష్టం చేస్తోంది. అకౌంట్‌ రిజిస్ట్రేషన్‌కు ఉపయోగించే ఫోన్‌ నెంబర్‌, లొకేషన్‌, మొబైల్‌ డివైజ్‌ డేటా, ఐపి అడ్రస్‌ వంటివి ఫేస్‌బుక్‌, ఇతర థర్డ్‌ పార్టీస్‌కు వాట్సప్‌ షేర్‌ చేయనున్నట్టు టెక్‌ నిపుణులు చెబుతున్నారు. 

 
ఫేస్‌బుక్‌, లేదా థర్డ్‌ పార్టీస్‌ను వినియోగించే సంస్థలు వినియోగదారులతో కమ్యూనికేట్‌ చేసేందుకు వీలుగా వాట్సాప్‌ను వినియోగించేలా తన ప్రైవసీ పాలసీని వాట్సప్‌ అప్‌డేట్‌ చేసింది.