గడచిన 24 గంటల్లో ఒక్క స్ట్రెయిన్ కేసు కూడా లేదు  

దేశ ప్రజలకు కేంద్రం కాస్త ఊరట కలిగించే విషయాన్ని చెప్పింది. గడచిన 24 గంటల్లో కొత్తగా ఒక్క స్ట్రెయిన్ కేసు కూడా నమోదు కాలేదని కేంద్రం ఆదివారం ప్రకటించింది. ఇప్పటివరకూ యూకేలో వెలుగుచూసి కొత్త కరోనా స్ట్రెయిన్ కేసుల సంఖ్య భారత్‌లో 90కి చేరింది. 
 
యూకేలో కరోనా స్ట్రెయిన్ వైరస్ గుర్తించిన అనంతరం కేంద్రం డిసెంబర్ 22 నుంచి యూకేకు రాకపోకలపై నిషేధం విధించింది. జనవరి 8తో ఈ నిషేధ గడువు ముగిసింది. ప్రస్తుతం యూకే నుంచి భారత్‌కు విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే.. యూకేలో విమానం ఎక్కే సమయంలో  భారత్‌లో విమానం దిగిన అనంతరం వారికి తప్పనిసరిగా ఆర్-పీసీఆర్ టెస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. 
 
 భారత్‌లో కరోనా ప్రభావం కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. భారత్‌లో కొత్తగా 18,645 కరోనా కేసులు, 201 మరణాలు నమోదయినట్లు కేంద్రం తెలిపింది. భారత్‌లో ప్రస్తుతం 2,23,335 యాక్టివ్ కేసులు ఉండటం గమనార్హం. కేరళలో అత్యధికంగా 64,516 యాక్టివ్ కరోనా కేసులుండగా, మహారాష్ట్రలో 54,129 యాక్టివ్ కేసులు ఉండటం గమనార్హం.