రైతు ఆందోళనల వెనుక కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు   

రైతు ఆందోళనల వెనుక కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల పాత్ర ఉన్నట్లుగా బయటపడుతున్నదని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ ఆరోపించారు. ఆదివారం తాను నిర్వహించ తలపెట్టిన కిసాన్ మహాసభను అడ్డుకునే సంఘటన ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చిందని చెప్పారు.
తాను చెప్పదలచుకున్న ఉద్దేశం కంటే ఇది చాలా పెద్దదని పేర్కొన్నారు. రైతులు సామాన్యులు, తక్కువగా చదువుకున్న వారు అయినప్పటికీ తెలివిగలవారని ఖట్టర్‌ చెప్పారు. ఆందోళనలు, హింసకు పాల్పడే స్వభావం రైతులకు ఉండదని స్పష్టం చేశారు. ఈ నిరసనలకు బాధ్యులు ఎవరన్నది అందరికీ తెలుసునని చెప్పారు.
భారతీయ కిసాన్‌ యూనియన్‌ చీఫ్‌ గుర్నమ్‌ సింగ్‌ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడిన వీడియో రెండు రోజుల ముందు బాగా ప్రసారమైందని గుర్తు చేశారు.  మనది బలమైన ప్రజాస్వామ్య దేశమని, ప్రతి ఒక్కరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ ఉన్నదని ఖట్టర్‌ తెలిపారు.
ఆరోపిత రైతులు, నేతల ప్రకటనలను తాము ఎప్పుడూ అడ్డుకోలేదని చెప్పారు. అందుకే రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయని, కరోనా నిబంధనలు ఉన్నప్పటికీ వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని గుర్తు చేశారు. సభలో మాట్లాడాలనుకునే వారిని అడ్డుకోవడం సరికాదని ఖట్టర్‌ హితవు చెప్పారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనను ప్రజలు సహించరని హెచ్చరించారు. 1975లో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి కాంగ్రెస్‌ ప్రయత్నించిందని విమర్శించారు. ఆ సమయంలో ప్రజలు వారి అసహ్యకరమైన పనిని గుర్తించి అధికారం నుంచి విసిరిగొట్టారని ఖట్టర్‌ మండిపడ్డారు.