ముఖ్యమంత్రులతో నేడు ప్రధాని మోదీ భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం 4 గంటలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై వారితో విస్తృతంగా చర్చించనున్నారు. 

కరోనా టీకా సరఫరా విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ అనే టీకాల అత్యవసర వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చిన తర్వాత ప్రధాని మోదీ సీఎంలతో భేటీ అవుతుండడం ఇదే తొలిసారి. 

కాగా, ప్రపంచంలోనే అతి పెద్ద టీకా కార్యక్రమంలో అత్యంత కీలకమైన టీకాల సరఫరా సోమవారం సాయంత్రం (జనవరి 11) లేదా మంగళవారం (జనవరి 12) ఉదయం నుంచి ప్రారంభం కానుంది. పుణెలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండి యా (ఎస్‌ఐఐ) నుంచి టీకాల రవాణా ప్రారంభం కానుందని తెలుస్తున్నది. 

ఎస్‌ఐఐ కొత్త ప్లాంటు ఉన్న మంజరి ప్రాంతం నుంచి 300 టీకా ట్రక్కులు బయల్దేరుతాయని ఆ వర్గాలు వివరించాయి. అన్ని ట్రక్కులకూ జీపీఎస్‌ అమర్చినట్టు వెల్లడించాయి. ముందు జాగ్రత్త చర్యగా మరో 500 ట్రక్కులను కూడా సిద్ధం చేస్తున్నట్టు  తెలిపాయి. వ్యాక్సినేషన్‌ సన్నద్ధతలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా మూడు దఫాలు డ్రై రన్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం దాదాపు ఏర్పాట్లు పూర్తి చేసింది. సిబ్బందికి శిక్షణ ఇచ్చింది.

కాగా,  కోవిన్‌ (కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌) యాప్‌ ద్వారా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను సమన్వయం చేయనున్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌లో రిజిస్టర్‌ చేసుకున్న 79 లక్షలకుపైగా వ్యాక్సిన్‌ లబ్ధిదారులకు సంబంధించిన సమగ్ర వివరాలు అందుబాటులో ఉంటాయి. మొదటి దశలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న కోటి మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్‌ అందించనున్నారు. వారిత్వరాత పోలీసులు, భద్రతా సిబ్బందికి పంపిణీ చేస్తారు. అనతరం 50 ఏండ్ల పైబడిన వయస్సున్న సుమారు 27 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేయనున్నారు.