బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు ఖాయం

పశ్చిమబెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ (బీజేపీ)కి 200 కు పైగా సీట్లు వస్తాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ జోస్యం చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు కోపంగా ఉన్నారని మంత్రి చెప్పారు.
 
‘‘బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారు, మార్పు కోసం ప్రజలు ఆరాటపడుతున్నారు. బెంగాల్‌లో 200 స్థానాలకు పైగా గెలిచి బీజేపీ టిఏంసీని ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.’’ అని మంత్రి ప్రహ్లాద్ సింగ్ వెల్లడించారు. 
 
ఉత్తర బెంగాల్ ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి పటేల్ మాట్లాడుతూ టీ గార్డెన్ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శించారు.  ప్రకృతి డార్జిలింగ్ కు ప్రతిదీ ఇచ్చిందని, కాని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల టీ తోటల కార్మికుల పరిస్థితి మెరుగుపడలేదని మంత్రి ఆరోపించారు.
డార్జిలింగ్ ప్రజల కళలు, సంస్కృతిని టీఎంసీ సర్కారు విస్మరించిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అయిన ప్రహ్లాద్ ఆరోపించారు.డార్జిలింగ్ లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి వేదిక ఏదీ లేదని, రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తే, తన కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ హాలు నిర్మిస్తుందని మంత్రి చెప్పారు. బెంగాల్ సంస్కృతి చాలా గొప్పదని, ఇక్కడి కళాకారుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాల్సి ఉందని కేంద్ర మంత్రి పటేల్ చెప్పారు.