ఢిల్లీ అల్లర్లకు తాహిర్, ఉమర్ ఖలీద్ కుట్ర

ఈశాన్య ఢిల్లీలో 2020 ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లను తాహిర్ హుస్సేన్, ఉమర్ ఖలీద్, ఖలీద్ సైఫి ప్రోత్సహించినట్లు ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. ఈ కేసులో రెండో అనుబంధ ఛార్జిషీట్‌లో ఈ వివరాలను కోర్టుకు తెలిపారు.

ఈ ఛార్జిషీటులో ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాహుల్ కసన సాక్ష్యమిస్తూ, సస్పెండెడ్ ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్, జేఎన్‌యూ పూర్వ విద్యార్థి ఉమర్ ఖలీద్, యాక్టివిస్ట్ ఖలీద్ సైఫీ ఈ అల్లర్లకు ముందు కలిసినట్లు చెప్పారు. 2020 జనవరి 8న వీరు ముగ్గురూ షహీన్ బాగ్ వద్ద కలిశారని, వీరి మనసులు కలిశాయని ధ్రువీకరించారు. 

అల్లర్లను రెచ్చగొట్టేందుకు డబ్బు కోసం తాహిర్ హుస్సేన్ మ్యాన్‌పవర్ సప్లయ్‌కి సంబంధించిన ఫేక్ బిల్స్‌ను ఇచ్చాడని తెలిపారు. ఈ కేసులో ప్రధాన ఛార్జిషీటును గత ఏడాది జూన్‌లో దాఖలు చేశారు. 

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగే ప్రదేశాలకు తాహిర్ హుస్సేన్ వెళ్లేవాడని, అక్కడి నిరసనకారులకు డబ్బులిచ్చేవాడని రాహుల్ సాక్ష్యమిచ్చారు. 2020 జనవరి 8న తాహిర్, ఉమర్, సైఫీ ఓ గంటపాటు షహీన్ బాగ్‌లో సమావేశమయ్యారని చెప్పారు. 

ఆ తర్వాత ఒకట్రెండు రోజుల అనంతరం తనను తాహిర్ నోయిడాలోని ఆయన స్నేహితుని ఇంటికి ఆర్టీజీఎస్ పేపర్‌ ఇచ్చి పంపించారని తెలిపారు. ఉమర్ ఖలీద్ కూడా తన నేరాన్ని అంగీకరించినట్లు ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.

సీఏఏకు వ్యతిరేకంగా తాను జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపినప్పటికీ పార్లమెంటు దానిని ఆమోదించిందని, దీంతో తాను సైఫీ, తాహిర్‌లతో కలిసి హింసాత్మక సంఘటనలకు ప్రణాళిక రచించానని తెలిపారని  పేర్కొన్నారు.  దీనికోసం వ్యూహాన్ని రచించేందుకు 2020 ఫిబ్రవరి 16, 17 తేదీల్లో తాము సమావేశమయ్యామని ఖలీద్  తెలిపారని చెప్పారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఇదొక్కటే మార్గమని భావించినట్లు చెప్పారని తెలిపారు.