గేమ్‌ ఛేంజర్‌గా  రవాణా కారిడార్లు 

దేశంలో మౌలిక సదుపాయాల ఆధునీకరణలో సరుకు రవాణా కారిడార్ల ప్రాజెక్టు ఒక భాగమని, 21వ శతాబ్దంలో ఈ ప్రాజెక్టులు గేమ్‌ ఛేంజర్‌గా ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమ సరుకు రవాణా కారిడార్‌లో భాగంగా ఉన్న న్యూ రేవారి-న్యూ మదార్‌ సెక్షన్‌ను మోడీ వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. 

ఇది ప్రపంచంలోనే 1.5 కిలోమీటర్ల పొడవైన మొట్టమొదటి ఎలక్ట్రిఫైడ్‌ కంటెయినర్‌ రైలు కావడం గమనార్హం. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. దాదాపు ఆరేళ్ల అనంతరం ఈ సెక్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. 

దీనివల్ల దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్‌), హర్యానా, రాజస్థాన్‌లోని రైతులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. పలు నగరాల్లో అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటయ్యేందుకు, పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు ఉపాధి అవకాశాలు మెరుగయ్యేందుకు ఈ కారిడార్‌ దోహదం చేస్తుందని పేర్కొన్నారు. 

దేశంలోని మౌలిక సౌకర్యాల ఆధునీకరణకు చేపట్టిన మహాయజ్ఞం నేడు ఊపందుకున్నదని చెబుతూ గత ఐదారేళ్లుగా సాగించిన కృషి కారణంగా ఈ ప్రాజెక్టులో అధిక భాగం నేడు వాస్తవ రూపం దాల్చిందని ఆయన చెప్పారు.

జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో వేగంగా, చౌకగా ప్రవేశం కల్పించడం ద్వారా స్థానికంగా ఉన్న పరిశ్రమలు, తయారీ యూనిట్లకు కొత్తగా బూస్టప్‌ ఇచ్చినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. గతంలో సరాసరి గంటకు 25 కిలోమీటర్లతో ఉండే గూడ్స్‌ రైలు వేగాన్ని ప్రస్తుతం 95 కిలోమీటర్ల వరకూ పెంచినట్లు చెప్పారు.  

గత 10-12 రోజులుగా జాతికి అంకితం చేసిన వివిధ ప్రాజెక్టుల గురించి ప్రధాని వివరించారు. కొద్ది రోజుల క్రితం భారతదేశం రెండు భారత తయారీ కరోనా వ్యాక్సిన్లను ఆమోదించిందని, మనం సొంతంగా వ్యాక్సిన్ తయారు చేసుకోవడం దేశ ప్రజలకు ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని కల్పించిందని ఆయన చెప్పారు. 

ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య, రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా, రైల్వే మంత్రి పియుష్ గోయల్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తదితరులు పాల్గొన్నారు