డ్రైరన్‌కు, వ్యాక్సినేషన్‌కు సంసిద్ధం కావాలి 

డ్రైరన్‌కు, వ్యాక్సినేషన్‌కు సంసిద్ధం కావాలి 
కరోనా వ్యాక్సిన్ రెండో దశ డ్రై రన్‌కు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ తెలిపారు. రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి హర్ష వర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హర్షవర్ధన్ సూచనలు చేశారు.

డ్రైరన్‌కు, వ్యాక్సినేషన్‌కు అందరూ సంసిద్ధం కావాలని, వ్యాక్సిన్ విషయంలో వస్తున్న అసత్యపు ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘నాలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వ్యాక్సిన్ డ్రైరన్‌పై సమీక్ష నిర్వహించాం. ఫీడ్‌బ్యాక్ ప్రకారం ఈ విషయంలో కొంత మెరుగుదల అవసరమని గ్రహించాం. శుక్రవారం 33 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ డ్రైరన్ ప్రారంభమవుతుంది.’’ అని హర్షవర్ధన్ ప్రకటించారు.

టీకాలు వేసే వారికి శిక్షణ ఇస్తున్నామని, తగిన మార్గదర్శకాలనూ జారీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. వీటి విషయంలో ఓ ప్రోటోకాల్‌ను రూపొందించామని, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే సదరు వ్యక్తిని అర్ధగంట పాటు పర్యవేక్షణలో ఉంచుతామని ఆయన తెలిపారు. అందుకే ఎలాంటి భయాలూ లేకుండా అన్ని రాష్ట్రాలూ వ్యాక్సినేషన్‌కు సంసిద్ధంగా ఉండాలని హర్షవర్ధన్ కోరారు.

దేశంలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ‘‘దేశంలో ప్రతి ఒక్కరికీ టీకా ఇచ్చే ప్రయత్నంలోనే ఉన్నాం. టీకాలపై అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మలేదు. ప్రాధామ్య వర్గాలకు ముందుగా టీకా ఇవ్వాలని డీసీజీఐ సూచించింది.’’ అని హర్షవర్ధన్ తెలిపారు.

రేపు దేశ వ్యాప్తంగా రెండో సారి వ్యాక్సిన్ డ్రైరన్ నిర్వహిస్తామని వెల్లడించారు. పోలియో, మీజిల్స్ లాంటి మహమ్మారులను దేశం నుంచి తరిమేశామని, కరోనా మహమ్మారిని కూడా సమూలంగా నిర్మూలిద్దామని పిలుపిచ్చారు. కరోనా టీకా నిల్వ సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు.