కృష్ణా బోర్డు  వైజాగ్‌‌కు తరలించేందుకు సిద్ధం 

కృష్ణా బోర్డు  ప్రధాన  కార్యాలయంను  వైజాగ్‌‌కు తరలించేందుకు కేఆర్‌‌ఎంబీ  ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేఆర్‌‌ఎంబీ సభ్యుడు హరికేశ్‌‌ మీనా జలశక్తి శాఖ సీనియర్‌‌ జాయింట్‌‌ కమిషనర్‌‌కు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం వైజాగ్‌‌లో బోర్డు హెడ్‌‌ క్వార్టర్స్‌‌ ఏర్పాటుకు ముందుకు వస్తూ లేఖ ‌‌ రాసిందని వివరించారు. వైజాగ్‌‌లో బోర్డు ఆఫీస్‌‌కు అవసరమైన వసతిని  గుర్తించగానే మళ్లీ సమాచారమిస్తామని తెలిపిందని పేర్కొన్నారు.

వసతిని  ఏపీ గుర్తించగానే బోర్డును వైజాగ్‌‌ మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బోర్డు బదిలీకి నిధుల కొరత ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. 2020 –-21 ఆర్ధిక సంవత్సరం​కు  నిధులు విడుదల ‌ చేయాలని రెండు రాష్ట్రాలను పలుమార్లు కోరినా  నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు. బోర్డు తరలింపునకు కార్యాచరణ ప్రణాలికను ‌‌ రూపొందించి కేంద్రానికి పంపుతున్నామని, నిధులు సమకూర్చగానే మారుస్తామని చెప్పారు.

కాగా, హైదరాబాద్​లో ఉన్న కృష్ణా బోర్డు హెడ్‌‌ క్వార్టర్స్  తరలింపులో తెలంగాణ ప్రమేయం లేకుండానే ప్రకియ పూర్తయ్యేలా కనిపిస్తోంది. రెండో అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ మీటింగ్‌‌లో ఏపీలో కృష్ణా బోర్డు ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం  అంగీకరిస్తూ కేంద్రానికి లేఖ ​ రాసింది. దీంతో హెడ్‌‌ క్వార్టర్స్‌‌ మార్పుకు మళ్లీ తెలంగాణను సంప్రదించాల్సిన అవసరం లేదని బోర్డు అధికారులు చెప్తున్నారు.

కాగా, కోటాకు మించి నీళ్లివ్వాలని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం ఇండెంట్‌‌ పంపింది. నిర్ణయించిన కోటా ప్రకారం ఏపీకి ఇంకో 95 టీఎంసీలే దక్కాల్సి ఉండగా మార్చి నెలాఖరుకే 108.50 టీఎంసీలు ఇవ్వాలని కోరింది. వాడుకున్న నీటిలో ఫ్లడ్‌‌ డేస్‌‌లో తీసుకున్న 125 టీఎంసీలను కోటా నుంచి మినహాయించాలంది. ఏపీ ఇరిగేషన్‌‌ ఈఎన్సీ నారాయణరెడ్డి కేఆర్‌‌ఎంబీ మెంబర్‌‌ సెక్రటరీ డీఎం రాయ్‌‌పురేకు లేఖ రాశారు.

మరోవైపు మార్చి నెలాఖరు వరకు తెలంగాణకు 83 టీఎంసీల నీటిని కేటాయించాలని ఈఎన్సీ మురళీధర్‌‌ కేఆర్‌‌ఎంబీకి లేఖ ‌‌ రాశారు. నాగార్జునసాగర్‌‌ ఎడమ కాలువ, ఏఎమ్మార్పీ, హైదరాబాద్‌‌ తాగునీటికి 65 టీఎంసీలు, కల్వకుర్తి లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ ప్రాజెక్టు నుంచి 18 టీఎంసీలు తీసుకునేందుకు అనుమతివ్వాలని ఇండెంట్‌‌లో కోరారు.