విగ్రహాల ధ్వంసం ఘటనల వెనుక లోతైన కుట్ర   

రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న దేవతా విగ్రహాల ధ్వంసం ఘటనల వెనుక లోతైన కుట్ర దాగి ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో మతసామరస్యంలో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. 

మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు.. మతాల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి చట్టాలను ఉల్లంఘించేందుకు ప్రయత్నించేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని, ఎవరైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా తన నేతృతంలో రాష్ట్రస్థాయిలోనూ, కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా స్థాయిలోనూ ఉన్నత స్థాయి కమిటీలను నియమిస్తూ జీవో నంబరు 6ను విడుదల చేసినట్లు చెప్పారు. 

రాష్ట్ర స్థాయి కమిటీకి చైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైస్‌చైర్మన్‌గా డీజీపీ వ్యవహరిస్తారు. కమిటీలో హోం, సాధారణ పరిపాలన, దేవదాయ, మైనారిటీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయి కమిటీకి చైర్మన్‌గా కలెక్టరు, వైస్‌ చైర్మన్‌గా ఎస్పీ ఉంటారు. రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల్లో వివిధ మతాలకు చెందిన వారు సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. కమిటీకి ఎలాంటి కాలపరిమితీ లేదని, నిరంతరం కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 

ముఖ్యమంత్రి, డీజీపీ, హోం మంత్రి ముగ్గురూ క్రిస్టియన్‌ మతస్తులని తెలుగుదేశం, బీజేపీ చేస్తున్న ఆరోపణలపై దాస్‌ స్పందిస్తూ ఉన్నత స్థానంలో ఉన్న రాజకీయ ప్రముఖులు, ముఖ్యమంత్రి, మంత్రులు, అఖిల భారత  సర్వీసులో బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులకు కులాలు, మతాలు ఉండవని పేర్కొన్నారు. ప్రజాసేవలో ఉన్నవారికి కులాలు, మతాలు ఆపాదించడం మంచిది కాదని చెప్పారు.

వరుస ఘటనల దోషులను పట్టుకునేందుకు పోలీసు శాఖ కృషి చేస్తోందని చెప్పారు. ప్రార్థనా స్థలాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంపై దృష్టి సారిస్తామని తెలిపారు. ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తామని చెప్పారు. ప్రజల్లో శాంతిభద్రతలపై విశ్వాసాన్ని నింపుతామని భరోసా ఇచ్చారు. 

కాగా, విగ్రహాల ధ్వంసానికి సంబంధించి చేపడుతున్న విచారణలన్నీ లోతుగా, విశ్లేషణాత్మకంగా, సాంకేతికంగా, తార్కికంగా జరుగుతున్నాయని అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ ఈ సందర్భంగా చెప్పారు. ‘ఓపెన్‌ మైండ్‌సెట్‌’తోనే దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ముందస్తుగా ఓ అభిప్రాయానికి వచ్చి విచారణ జరపడం లేదని,  అలా చేస్తే భవిష్యత్‌లో న్యాయస్థానాల్లో చిక్కులు ఎదురవుతాయని పేర్కొన్నారు.

అంతర్వేది ఘటన జరిగాక కృష్ణా జిల్లాలోనూ, రాజమండ్రిలోనూ జరిగిన ఘటనలు పరిశీలిస్తే.. విగ్రహాలు ధ్వంసం చేసేందుకు ఒకే ఎలక్ట్రిక్‌ రంపాన్ని వాడినట్లుగా తేలిందని తెలిపారు. దీంతో ఒక్కరే ఈ విధ్వంసాలకు పాల్పడుతున్నారా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయని.. ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.