‘చలో రామతీర్థం’ మరోసారి భగ్నం   

విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని రామతీర్థం కూడలి మరోసారి రణరంగమైంది. రెండు రోజుల క్రితం బీజేపీ, జనసేన సంయుక్తంగా చేపట్టిన ‘చలో రామతీర్థం’ భగ్నం కావడంతో ఆ పార్టీల శ్రేణులు గురువారం మరోసారి క్షేత్రాన్ని సందర్శించడానికి యత్నించాయి. బీజేపీ నాయకులను అడ్డుకోవడానికి పోలీసులు ప్రతి కూడలి వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. 

రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆయన బృందం పెళ్లి ముస్తాబు చేసిన కారులో రామతీర్థం కూడలికి చేరుకోవడంతో అంతా విస్తుపోయారు. ఆ కారును తనిఖీ చేసిన పోలీసులు వారిని ముందుకు కదలనీయలేదు. 

దీంతో సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, మాజీమంత్రి అదినారాయణరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని తదితరులు రామతీర్థం వైపు నడిచి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో పోలీసు బలగాలు, బీజేపీ, జనసేన నాయకుల మధ్య భారీ తోపులాటలు జరిగాయి. 

తోపులాటల్లో నలిగిపోయిన సోము వీర్రాజు రోడ్డుపై కుప్పకూలి స్పృహ కోల్పోయారు. దాదాపు 45 నిమిషాల పాటు ఆయన స్పృహలేకుండా రోడ్డుపై నాయకుల ఒడిలోనే ఉన్నారు. తేరుకున్న తరువాత మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు.

 ‘రామాలయానికి వెళ్లనీయకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న జగన్‌… పర్యవసానం అనుభవిస్తావు’ అంటూ హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నిరంకుశ పరిపాలనలో ఉన్నామా అంటూ మండిపడ్డారు. దీనికి పర్యవసానంగా జాతికి క్షమాణలు చెప్పేరోజు వస్తుందని జగన్‌పై వీర్రాజు విరుచుకుపడ్డారు.  

 బీజేపీ రాష్ట్ర నాయకుడు భానుప్రకాశ్‌రెడ్డి  పోలీసుల వలయాన్ని దాటుకుని రామతీర్థం ఆలయం వద్దకు చేరుకున్నారు. నిఘా కెమెరా కంటికి చిక్కిన ఆయన్ను, ప్రధాన అనుచరులను బస్సులో నెల్లిమర్ల పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా, విజయవాడ నుంచి వచ్చిన  బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డి తొక్కిసలాటలో రోడ్డుపై పడి స్పృహ తప్పారు. ఆయన కుడికన్ను రెప్పపై గాయమైంది. 

ఆ సమయంలో ఎంత ప్రయత్నించినా అంబులెన్స్‌ రాకపోవడం, పోలీసులు పట్టించుకోకపోవడంతో  బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలే సపర్యలు చేశారు. పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఆయన్ను విజయనగరం ఆస్పత్రికి, అక్కడినుంచి విశాఖ ఆస్పత్రి కి తరలించారు. 

విష్ణువర్ధన్‌రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఫోన్‌చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై డీజీపీతో మాట్లాడతానని చెప్పారు. 

కాగా, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇటువంటి నిరంకుశ ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని, సీఎం జగన్‌ తక్షణం రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.విష్ణుకుమార్‌రాజు డిమాండ్‌ చేశారు. రామతీర్థం బయలుదేరిన ఆయన్ను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.