రైతు సంక్షేమం, అభివృద్ధికి ఉద్దేశించిన ‘కిసాన్ కల్యాణ్ మిషన్’ను లక్నోలోని దదుపూర్ గ్రామంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభిస్తూ గత ప్రభుత్వాలు రైతు సమస్యలపై ఉదాసీన వైఖరితో వ్యవహరించాయని ఆరోపించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వాల వైఖరి కారణంగా 2004 నుంచి 2014 వరకూ లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు నూతన సాంకేతికతను ఉపయోగించుకుని అభ్యుదయ పథంలో పయనిస్తున్నారని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.
ఆత్మహత్యల నుంచి ఆదాయం వైపు రైతులను మళ్లించడమే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం అనేక పథకాలకు రూపకల్పన చేశామని చెప్పారు. 70 ఏళ్లుగా వ్యవసాయరంగంలో వృద్ధి జరిగి ఉంటే రైతుల ఆదాయం ఆరేళ్లలో రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని మోదీ ప్రభుత్వం నిర్దేశించుకునే అవసరం ఉండేది కాదని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ విధానాల వల్ల రైతులు లబ్ది పొందుతున్నారని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం ప్రధాని పాటుపడుతున్నారని, ప్రధాని పంటల భీమా పథకం కింద రైతులు దరఖాస్తు చేసుకుని పంటలను వన్యమృగాలు పాడుచేసినప్పటికీ సులభంగా బీమా సొమ్ము పొందగలుగుతున్నారని చెప్పారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేసిన ఘనత మోదీదేనని కొనియాడారు.
యూపీలోని రైతులకు ఏటా వారి అకౌంట్లలో రూ 2.30 కోట్లు జమ అవుతున్నాయని, రైతుల ముఖంలో ఆనందం చూస్తుంటే రైతులు ఆర్థికంగా ఎంత బలపడుతున్నారో తెలుస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. కిసాన్ కల్యాణ్ మిషన్ కింద రైతుల కోసం వివిధ కార్యక్రమాలు చేపడతామని సీఎం చెప్పారు.
వ్యవసాయ, అనుబంధ రంగాల ఎగ్జిబిషన్ల ఏర్పాటు, శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, వ్యవసాయ శాఖ అనుబంధ వర్కర్లతో తరచు సమావేశాలు ఏర్పాటు చేస్తామని, శాస్త్రీయ సేద్యం గురించి ఈ సమావేశాల్లో వివరించడంతో పాటు ప్రభుత్వ పథకాల సమాచారం కూడా వారు తెలియజేస్తారని చెప్పారు. వ్యవసాయ శాఖ చేపట్టే పథకాల నుంచి కూడా రైతులు లబ్ది పొందుతారని తెలిపారు. కిసాన్ కల్యాణ్ మిషన్ కింద రాష్ట్రంలోని 75 జిల్లాల నుంచి 100 మంది ప్రగతిశీలక రైతులను ప్రభుత్వం సన్మానిస్తుందని తెలిపారు. ఈ పథకం కిందకు రాష్ట్రంలోని 825 బ్లాకులు వస్తాయని సీఎం పేర్కొన్నారు.
More Stories
అమిత్ షాపై కెనడా ఆరోపణలపై భారత్ అసంతృప్తి
మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం కచ్చితం
పోలింగ్ కన్నా ముందే అమెరికాలో సగంకు పైగా ఓట్లు