ఎమ్మెల్సీ సిట్టింగ్ స్థానం కోసం బిజెపి వ్యూహం 

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ సెట్టింగ్ స్థానాన్ని మరోసారి కైవసం చేసుకొనేందుకు బిజెపి వ్యూహరచన చేసింది. ప్రస్తుతం బిజెపి నేత ఎన్ రామచంద్రరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
 
 దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలలో లభించిన విజయాలతో ఉత్సాహంగా ఉన్న రాష్ట్ర బిజెపి నేతలు ఈ స్థానం కూడా సునాయనంగా గెలుపొందగలమనే ధీమాతో ఉన్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, యువకులలో కేసీఆర్ ప్రభుత్వంపై నెలకొన్న అసంతృప్తి తమకు గెలుపుకు   దారితీస్తుందని  విశ్వసిస్తున్నారు.
ఈ విషయమై రాష్ట్ర బిజెపి కార్యాలయంలో గురువారం జరిగిన వ్యూహరచన సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ ఛార్జ్ తరుణ్ ఛుగ్ హాజరయ్యారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డి కె అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్ ఇంద్రసేనారెడ్డి, పేరాల చంద్రశేఖరరావు తదితర నేతలు పాల్గొన్నారు.
 
 5 లక్షల 80వేల ఓట్లు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో నమోదు కాగా, వాటిల్లో సగంకు పైగా  3 లక్షల ఓట్లను బీజేపీ అనుబంధ సంస్థలు నమోదు చేయించాయని రాష్ట్ర  బీజేపీ ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. రానున్న రెండు నెలల కోసం మండలాల వారీ సమస్యలపై రోడ్ మ్యాప్ సిద్ధం చేశామని ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు.