ఒక వంక అధ్యక్ష పదవికి ఎన్నికైన జో బైడెన్ ఈ నెల 20న పదవీ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధం అవుతుండగా, మరోవంక అమెరికా అధ్యక్ష పీఠాన్ని తాను ఎట్టి పరిస్థితిలోనూ వదిలి పెట్టేది లేదని అంటూ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మొండి పట్టుదలను ప్రదర్శిస్తున్నారు. అవసరమైతే ఎంతవరకైనా పోరాడతానని వెల్లడించారు.
జార్జియాలో తన మద్దతు దారులు నిర్వహించిన భారీ ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ ఎవరూ వైట్ హౌస్‌లోకి అడుగు పెట్టలేరని, తాను అధ్యక్ష పీఠాన్ని వదిలి పెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, లేకపోతే.. తానే భారీ మెజారిటీతో గెలిచేవాడినని అంటూ చెబుతున్నారు.
అదే సమయంలో తన ఎన్నికల ఫలితంపై రిపబ్లికన్ చట్టసభల సభ్యులు మౌనం పాటించాలని సూచించారు. అంతేకాదు, బుధవారం జరగనున్న చట్టసభల సంయుక్త సమావేశంలో బైడెన్ ఫలితాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని రిపబ్లికన్ సభ్యులకు పిలుపునిచ్చారు. అలాగే, అధ్యక్ష భవనం వద్ద భారీ ర్యాలీ నిర్వహించాలని తన మద్దతుదారులకు సూచించారు.
‘‘నేను మీకు హామీ ఇస్తున్నా. బుధవారం మనదే. చట్టసభలో మనకు అంతా అనుకూలంగానే జరుగుతుంది!’’ అని ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే, అధ్యక్ష ఎన్నికలను రద్దు చేసేలా ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలపై రిపబ్లికన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ట్రంప్‌కు మద్దతు పలుకుతుండగా, మరికొందరు ప్రస్తుత, మాజీ సభ్యులు మాత్రం ఇది అమెరికన్ల విశాసాన్ని తక్కువగా అంచనావేయడమేనని విమర్శిస్తున్నారు. ఫలితంగా రిపబ్లికన్లు రెండుగా చీలుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
కాగా, అధ్యక్ష ఎన్నికలను రద్దు చేయాలంటూ ఊరూవాడా తిరుగుతున్న ట్రంప్‌కు పని చేయాలనే ధ్యాస లేకుండా పోయిందని ఎన్నికైన అధ్యక్షుడు బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఆయన పనిచేయడం మానేసి ఫిర్యాదులు చేస్తున్నారు. అలాంటి ఆయనకు అధ్యక్ష పీఠం ఎందుకో అర్ధం కావడం లేదు’’ అని ఎద్దేవా చేశారు.
మరోవంక, అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించేందుకు తనకు అనుకూలంగా 11 వేల ఓట్లు గుర్తించాలంటూ జార్జియా ఎన్నికల ఉన్నతాధికారికి ట్రంప్ చేసిన సూచనల ఆడియో తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై స్పందించిన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.. ఈ పరిణామం అమెరికా ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలకే గొడ్డలి పెట్టువంటిదని హెచ్చరించారు.
More Stories
హర్యానాలో వరుసగా మూడోసారి బీజేపీ అద్భుత విజయం
జమ్ముకశ్మీర్ తదుపరి సీఎంగా ఒమర్ అబ్దుల్లా
ఇజ్రాయిల్ నగరాలపై రాకెట్ల వర్షం