హిందూ దేవాలయం ధ్వంసంపై పాక్ సుప్రీం కోర్ట్ ఆగ్రహం 

ఓ శతాబ్దపు చరిత్రగల హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేయడం వల్ల పాకిస్థాన్‌‌కు అంతర్జాతీయ స్థాయిలో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందని ఆ దేశ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  గత వారం ఖైబర్ పఖ్తూన్‌క్వాలో ధ్వంసం చేసి, తగులబెట్టిన దేవాలయం పునరుద్ధరణను వెంటనే ప్రారంభించాలని ఎవాక్యూయీ ప్రాపర్టీ ట్రస్ట్ బోర్డు (ఈపీటీబీ)ని ఆదేశించింది. 

ఖైబర్ పఖ్తూన్‌క్వాలోని కరక్ జిల్లా, టెరి గ్రామంలోని ఓ శతాబ్దపు చరిత్రగల హిందూ దేవాలయాన్ని గత బుధవారం ముస్లిం అతివాదులు ధ్వంసం చేసి, తగులబెట్టిన సంగతి తెలిసిందే. రాడికల్ జామియత్ ఉలేమా-ఈ-ఇస్లాం పార్టీ (ఫజల్ ఉర్ రెహమాన్ గ్రూప్) సభ్యులు ఈ దారుణానికి తెగబడ్డారు. దీంతో మానవ హక్కుల ఉద్యమకారులు, మైనారిటీ హిందూ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ దుర్ఘటనపై పాకిస్థాన్ సుప్రీంకోర్టు స్వీయ విచారణ జరిపింది. జనవరి 5న (మంగళవారం) హాజరుకావాలని స్థానిక అధికారులను ఆదేశించింది. పాకిస్థాన్‌లోని దేవాలయాలు, గురుద్వారాల వివరాలను సమర్పించాలని ఈపీటీబీని ఆదేశించింది. 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గుల్జార్ అహ్మద్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపి దేశవ్యాప్తంగా దురాక్రమణలకు గురైన దేవాలయాల నుంచి ఆ దురాక్రమణలను తొలగించాలని ఈపీటీబీని ఆదేశించింది. ఈ దురాక్రమణలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 

కరక్ జిల్లాలోని టెరీ గ్రామంలో ఉన్న హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేయడం వల్ల పాకిస్థాన్ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా దెబ్బతిందని జస్టిస్ అహ్మద్ పేర్కొన్నారు. ఈ విచారణలో ఖైబర్ పఖ్తూన్‌క్వా చీఫ్ సెక్రటరీ, పోలీస్ చీఫ్, మైనారిటీల హక్కుల కమిషన్‌కు చెందిన డాక్టర్ షోయబ్ సుడ్లే పాల్గొన్నారు. 

మైనారిటీల హక్కుల కమిషన్ డాక్టర్ షోయబ్ సుడ్లే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ దేవాలయాన్ని సందర్శించారు. సోమవారం ఆయన సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో ఈ దేవాలయాన్ని ఈపీటీబీ పరిరక్షించలేదని తెలిపారు.  పోలీస్ చీఫ్‌ను ఉద్దేశించి జస్టిస్ ఇజాజుల్ అహ్‌సాన్  మాట్లాడుతూ, ఈ దేవాలయం పక్కనే పోలీస్ చెక్‌పోస్ట్ ఉండగా, దేవాలయం ఎలా ధ్వంసమైందని ప్రశ్నించారు. నిఘా వ్యవస్థలు ఏమైపోయాయని నిలదీశారు. 

దీనిపై పోలీస్ చీఫ్ స్పందిస్తూ, ఈ దాడిలో ప్రమేయం ఉన్న 109 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ సంఘటన జరిగినపుడు విధి నిర్వహణలో ఉన్న పోలీసు సూపరింటెండెంట్, డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ సహా 92 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. 

దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అహ్మద్ మాట్లాడుతూ సస్పెన్షన్ చేయడం సరిపోదని చెప్పారు. గవర్నమెంట్ మెంటాలిటీతో  చైర్మన్ పదవిలో ఉండకూడదని ఈపీటీబీ చైర్మన్‌ను మందలించారు. ఈపీటీబీ ఉద్యోగులు దేవాలయాల స్థలాల్లో వ్యాపారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 

వాళ్లందరినీ అరెస్టు చేసి, దేవాలయాన్ని పునర్నిర్మించాలని ఆదేశించారు. పునర్నిర్మాణానికి అవసరమయ్యే సొమ్మును మౌల్వీ షరీఫ్ నుంచి తీసుకోవాలని ఆదేశించారు. జస్టిస్ అహసాన్ మాట్లాడుతూ, సొంత భవనాలను నిర్మించుకునేందుకు ఈపీటీబీకి డబ్బులుంటాయి కానీ, హిందువుల కోసం ఖర్చు పెట్టేందుకు సొమ్ము ఉండదంటారని దుయ్యబట్టారు.

దేశ విభజన నేపథ్యంలో భారత దేశానికి వలస వెళ్ళిపోయిన హిందువులు, సిక్కుల దేవాలయాలు, ప్రార్థనా స్థలాలను నిర్వహించే బాధ్యత ఈపీటీబీకి ఉంది. ఇది చట్టబద్ధంగా ఏర్పాటైన బోర్డు.