నిజాం జమానా పాలనను తలపిస్తున్న కేసీఆర్ 

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నిజాం జామానా పాలనను తలపిస్తున్నాడని బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ జి  వివేక్ వెంకటస్వామి ఆరోపించారు.  కరోనా సమయంలో కేసీఆర్ ప్రజలకు ధైర్యం కల్పించాల్సింది పోయి ఫాం హౌస్ లో కూర్చున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. 

నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెంలో బీజేపీ శిక్షణ శిబిరంలో మాట్లాడుతూ రూ  35 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుల వ్యయాన్ని సీఎం కేసీఆర్ కమీషన్ల కోసం రూ లక్ష కోట్లకు పెంచి రాష్ట్రాన్ని అప్పులమయం చేశాడని దుయ్యబట్టారు. కాళేశ్వరం పేరుతో మళ్లీ రూ 85 వేల కోట్లు కొట్టెయ్యాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.

ప్రతిపక్షాలు, మీడియా గొంతు నొక్కాలని కేసీఆర్ భావించాడని, టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేసినా దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్యకర్తల కృషితో బీజేపీ విజయం సాధించిందని పేర్కొన్నారు. తెలంగాణలో ఏ పార్టీలో లేనంత బలమైన క్యాడర్ బీజేపీలో ఉందని, టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని స్పష్టం చేశారు. 

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఖచ్చితంగా గద్దె దించుతామని భరోసా వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతాల్లో కూడా బీజేపీకి మంచి స్పందన లభిస్తోందని, యువకులు ధైర్యంగా ముందుకొచ్చి బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. కృష్ణా బేసిన్ లో ఏపీ వల్ల తెలంగాణకు నీటి వాటాలో అన్యాయం జరుగుతున్నా కేసీఆర్ నోరెత్తటం లేదని ధ్వజమెత్తారు.

కృష్ణా నదిపై పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం పూర్తయితే ఎక్కువగా నష్టపోయేది పాలమూరు జిల్లానేనని చెప్పారు. క్రిష్ణా బేసిన్ లో తెలంగాణ వాటాకు వ్యతిరేకంగా ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులపై ఉద్యమాన్ని చేపడతామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టంతో రైతులకు లాభమే తప్ప నష్టం లేదని స్పష్టం చేశారు.