13 నుండి భారత్ లో కరోనా వ్యాక్సిన్  

13 నుండి భారత్ లో కరోనా వ్యాక్సిన్  
భారత్‌లో కరోనాను ఎదుర్కొనేందుకు ఈ నెల 13 నుండి కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు సిద్ధమని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగం కింద భారత్‌లో అనుమతి వచ్చిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ప్రజలకు 10 రోజుల్లో వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది. డ్రై రన్‌ ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా టీకాల పంపిణీకి కేంద్రం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. జనవరి 13 నుంచి భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానున్నట్లు కేంద్రం తాజా ప్రకటనతో స్పష్టమైంది. 
 
ఆస్ట్రాజెనెకా కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌, భారత్‌ బయోటెక్‌ కొవ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా గత ఆదివారం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్‌ పంపిణీకి సంబంధించి తొలి దశలో భాగంగా హెల్త్‌ కేర్‌ వర్కర్లకు, అత్యవసర సేవల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, వయసు పైబడిన వారికి టీకా ఇవ్వాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. 
 
వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు త్వరలో ముంబై, చెన్నై, కోల్‌కత్తా, హర్యానాలోని ప్రభుత్వ మెడికల్‌ స్టోర్‌ డిపోలకు విమానాల ద్వారా వ్యాక్సిన్‌ను తరలించనున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య కార్యదర్శి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. అక్కడి నుంచి 37 స్టేట్‌ వ్యాక్సిన్‌ స్టోర్లకు తరలించనున్నట్లు తెలిపారు. 
 
అక్కడి నుంచి జిల్లాల్లోని వ్యాక్సిన్‌ స్టోర్స్‌కు తరలించి.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ మొదలుపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. కొవిషీల్డ్‌, కొవ్యాక్సిన్‌లను నిల్వ చేసేందుకు 29,000 కోల్డ్‌ చైన్‌ పాయింట్స్‌ను భారత్‌లో సిద్ధం చేసినట్లు ఆరోగ్య కార్యదర్శి చెప్పుకొచ్చారు.