ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు 

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలి దశ ఈ నెల 29 నుంచి ప్రారంభం కావచ్చు. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు సిఫారసు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సిఫారసులకు ఆమోదం లభిస్తే, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పిస్తారు. 

ఈ సమావేశాలు ఫిబ్రవరి 15తో ముగుస్తాయి. రెండో దశ బడ్జెట్ సమావేశాలు మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి. లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు ప్రతి రోజూ నాలుగు గంటల చొప్పున జరుగుతాయి.

తొలి దశ సమావేశాల ప్రారంభంలో ఈ నెల 29న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో పాటించవలసిన నిబందనలను పాటిస్తూ ఈ సమావేశాలు జరుగుతాయి. 

కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు రద్దయిన సంగతి తెలిసిందే. నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఎక్కువగా ఉంది.