మమతాకు మరో మంత్రి రాజీనామా!

పశ్చిమ‌బెంగాల్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జికి మ‌రో షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే కీల‌క నేత సువేందు అధికారి స‌హా ప‌లువురు నేత‌లు టీఎంసీని వీడ‌టంతో పార్టీ బ‌ల‌హీన‌ప‌డింది. అసెంబ్లీ ఎన్నిక‌ల కొన్ని నెల‌ల ముందు చోటుచేసుకున్న ఈ ప‌రిణామాల‌తో  మ‌మ‌త కంగుతిన్నారు.
ఈ నేప‌థ్యంలో తాజాగా ప‌శ్చిమ‌బెంగాల్ క్రీడా, యువ‌జ‌న స‌ర్వీసుల శాఖ స‌హాయ మంత్రి, భారత మాజీ క్రికెట‌ర్ ల‌క్ష్మీర‌త‌న్ శుక్లా త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. దాంతో సువేద్ అధికారి రాజీనామా చేసిన పక్షం రోజులకే మ‌మతా బెన‌ర్జికి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్ల‌య్యింది. ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు గవర్నర్ జగదేవ్ ధనకర్ కు కూడా పంపారు.
మంత్రి ప‌ద‌వితోపాటు హౌరా జిల్లా తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి కూడా ల‌క్ష్మీర‌త‌న్ శుక్లా రాజీనామా చేశారు. అయితే ఎమ్మెల్యే ప‌ద‌వికి మాత్రం ఆయ‌న రాజీనామా చేయ‌లేదు.
కాగా, శుక్లా మ‌రే ఇత‌ర పార్టీలోనో చేర‌డం కోసం తృణ‌మూల్‌ను వీడ‌టం లేద‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఆయ‌న రాజ‌కీయాల్లోంచే పూర్తిగా వైదొల‌గాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని, అందుకే ముందుగా మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశార‌ని తెలిపాయి.