కోవాగ్జిన్‌పై రాజ‌కీయాలు వ‌ద్దు

కరోనా టీకా అంశం ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ రాజకీయాలతో తమకు ఏ మాత్రం సంబంధం లేదని  భారత్ బయోటెక్ సీఎండీ డా. కృష్ట ఎల్ల  స్పష్టం చేశారు. ప్రపంచంలోని అనేక మంది భారతీయ కంపెనీలనే ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారో అర్థం కావట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.   
 
క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకుండానే కొవ్యాక్సిన్‌కు కేంద్రం అత్యవసర అనుమతులు జారీ చేసిందన్న ఆరోపణలు  ఆవేదన వ్యక్తం చేస్తూ  త‌మ సంస్థ‌కు అనుభ‌వం లేద‌ని ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాదు అని ఆయ‌న పేర్కొన్నారు.  
 
త‌మ‌ది గ్లోబ‌ల్ కంపెనీ అని, ఇప్ప‌టికే అనేక ర‌కాల వ్యాక్సిన్ల‌ను త‌యారు చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు.  త‌మ కంపెనీ ఇప్ప‌టి వ‌ర‌కు 16 ర‌కాల టీకాల‌ను త‌యారు చేసిన‌ట్లు కృష్ణ ఎల్లా చెప్పారు.  భారత్‌లోనూ సృజనాత్మకత ఉంది. ఇదేమీ కాపీలు కొట్టే దేశం కాదు. కేవలం స్వదేశీ సంస్థ అయిన కారణంగా తమపై ఈ స్థాయిలో ఆరోపణలు రావడం భావ్యం కాదని అంటూ ఘాటుగా స్పందించారు. 
 
మ‌హ‌మ్మారి వేళ వ్యాక్సిన్‌తో వైద్య అవ‌స‌రాల‌ను తీర్చాల‌ని, ప్ర‌పంచ వ్యాప్తంగా అవ‌స‌ర‌మైన వారికి త‌మ వ్యాక్సిన్ అందించ‌డ‌మే త‌మ ముఖ్య ఉద్దేశ‌మ‌ని ఎల్ల తెలిపారు. కోవాగ్జిన్ టీకా అత్యంత సుర‌క్షిత‌మైంద‌ని, ఆ టీకాతో రోగ‌నిరోధ‌క శ‌క్తి కూడా ఘ‌ణ‌నీయంగా పెరుగుతోంద‌ని భరోసా వ్యక్తం చేశారు. 
 
అయితే మ‌న‌వాళ్లు వ్యాక్సిన్‌పై రాజ‌కీయం చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.  త‌మ కుటుంబానికి చెందిన ఒక్క‌రు కూడా ఎటువంటి రాజ‌కీయ పార్టీతో లింకులో లేరని స్పష్టం చేశారు.  వ్యాక్సిన్ ఉత్ప‌త్తిలో త‌మ‌కు అనుభ‌వం లేద‌ని చెప్పడం శోచ‌నీయ‌మ‌ని పేర్కొన్నారు.  123 దేశాల్లో త‌మ వ్యాక్సిన్ ఉత్ప‌త్తుల‌ను వాడుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.
 
“సైన్స్‌యే నాకు ఆక్సిజన్, నేను తమిళనాడుకు చెందిన ఓ రైతు కుటుంబం నుంచి వచ్చాను. మా కుటుంబానికి వ్యాపారంలో అసలేమాత్రం ప్రవేశం లేదు. మా సంస్థకు టీకాల తయారీలో విశేషానుభవం ఉంది. మా సేవలు ప్రపంచంలోని 123 దేశాలకు చేరుతున్నాయి. బ్రిటన్‌తో పాటూ మొత్తం 12 దేశాల్లో మేం ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాం”  అని వివరించారు.  
 
పైగా, ఫైజర్ కంపెనీతో పోల్చుకుంటే తమ టీకా ఏరకంగానూ తక్కువకాదని స్పష్టం చేశారు. కరోనా టీకా తయారీ ప్రక్రియపై ఐదు పరిశోధనా పత్రాలు ప్రచురించిన ఏకైక సంస్థ భారత్ భయోటెక్ అని గర్వంగా ప్రకటించారు. బ్రిటన్‌లో జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్‌ను కూడా డా. కృష్ణ  ప్రస్తావించారు.
 
 బ్రిటన్‌లోని ట్రయల్స్‌‌ను ఎవరూ ఎందుకు ప్రశ్నించరూ..? మా టీకాను ఓ కంపెనీ మంచి నీళ్లతో పోల్చింది.శాస్త్రవేత్త అయిన నన్న ఇది ఎంతో బాధించింది. మాకు ఇది తగదని ఆయన  ఆగ్రహం వ్యక్తం చేశారు.