బైబిల్ పార్టీ కావాలో.. భగవద్గీత పార్టీ కావాలో తేల్చుకోండి

ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం, వైసీపీలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎపీలో ఒక మతం రాజ్యమేలుతోందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బైబిల్ పార్టీ కావాలో.. భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. 
 
ఒక మతానికి వత్తాసు పలికితే తెలంగాణలో హిందువులు ఓటు బ్యాంకుగా మారి దుబ్బాక, జీహెచ్ఎంసీలో బుద్ది చెప్పారని గుర్తు చేశారు. తిరుపతిలో హిందువులు కూడా ఓటు బ్యాంకుగా మారాలని విజ్ఞప్తి చేశారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలే తిరుపతిలో పునరావృతమవ్వబోతున్నాయని జోస్యం చెప్పారు.
 
 ఏపీ హిందూ దేవాలయాలపై దాడులను ఖండించిన ఆయన వైసీపీ రెండు కొండలు అంటోందని పేర్కొంటూ ‘ఏడు కొండలవాడా గోవిందా గోవిందా’ అనేది బీజేపీ సిద్ధాంతమని స్పష్టం చేశారు. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం‌ కోసం దేశమంతా ఎదురుచూస్తోందని పేర్కొంటూ వైసీపీ ప్రభుత్వం మూటాముల్లె సర్దుకునేలా తరిమికొడతామని వెల్లడించారు. ఏపీ దేవాదాయశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు.‌ 
 
హిందువుల కానుకలను ఏపీ ప్రభుత్వం దారి మళ్ళిస్తోందని ఆరోపించారు. ఏపీ బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. దేవుళ్ళ విగ్రహాలను దుర్మార్గంగా ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. 
దేవాలయాలపై దాడులకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని స్పష్టం చేశారు. సోము వీర్రాజు నాయకత్వంలో ఏపీ బీజేపీ పోరాటానికి సిద్ధమవుతుందని చెబుతూ తెలంగాణ బీజేపీ కార్యకర్తల కంటే ఏపీ కార్యకర్తలు బలవంతులని పేర్కొన్నారు.  బీజేపీ కార్యకర్తలు రోడ్డుమీదికొస్తే వైఎస్సార్సీపీ మూటాముల్లే సర్దుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని భరోసా వ్యక్తం చేశారు. 
 
కాగా,  కేంద్రం నుంచి నిధులు రాబట్టాటానికి తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ, జనసేన అభ్యర్థిని గెలిపించాలని తెలంగాణ  బీజేపీ  ఓబిసి మోర్చా జాతీయ  అధ్యక్షుడు డా కె  లక్ష్మణ్ పిలుపునిచ్చారు.  అలయాయలపై జరుగుతున్న దాడులను సీఎం జగన్  తక్కువ చేసి మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. 
 
దాడులకు పాల్పడ్డ వారు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కఠినమైన చర్యలు లేకపోవడం వల్లనే..మళ్ళీ మళ్ళీ ఆలయాలపై దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. లేదంటే దేవాదాయ శాఖను ఎత్తేసి ఆలయాలను హిందు సమాజానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 
 
ఆలయాల దాడుల వెనుక బీజేపీ ఉందని సీపీఐ నారాయణ మతిస్థిమితం కోల్పోయి మాట్లాతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి, వైసీపీకి సీపీఐ తోక పార్టీగా మారిందని విమర్శించారు.