తాడిప‌త్రిలో ఉద్రిక్త‌త‌.. జేసీ బ్ర‌ద‌ర్స్ హౌస్ అరెస్ట్‌

అనంత‌పురం జిల్లా తాడిప‌త్రిలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ దుర్వినియోగంపై జేసీ సోదరులు సోమవారం తాడిపత్రిలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. పట్టణంలో కొవిడ్‌-19 నిబంధనలు, 144 సెక్షన్‌, 30 పోలీసు యాక్ట్‌ అమలులో ఉన్నాయని, నిరసన దీక్షకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఎన్ని ఆంక్షలు ఉన్నా నిరసన దీక్షకు వెనుకంజ వేసేది లేదని జేసీ సోదరులు స్పష్టం చేశారు. 
 
దీంతో భారీగా మోహరించిన పోలీసులు పట్టణంలో కవాతు నిర్వహించారు. ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.  జేసీ దివాక‌ర్ రెడ్డిని ఫామ్ హౌజ్ వ‌ద్ద‌నే నిర్బంధించ‌గా, ప్ర‌భాక‌ర్ రెడ్డిని ఇంటి వ‌ద్దే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జేసీ బ్ర‌ద‌ర్స్ అనుచ‌రులు వారిద్ద‌రి నివాస‌ల వ‌ద్ద‌కు భారీగా చేరుకుంటున్నారు.
 
జేసీ బ్ర‌ద‌ర్స్ నివాసాల వ‌ద్ద పోలీసులు భారీగా మోహ‌రించారు. ఇప్పటికే తాడిపత్రిలో 30 యాక్టు,144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎటువంటి సభలు, సమావేశాలు, ధర్నాలు నిరసన ప్రదర్శనలకు అనుమతి ఉండదని పోలీసులు తేల్చిచెప్పారు.  
 
“రాజకీయాలకతీతంగా చేపట్టిన ఇద్దరి నిరసన దీక్షకు భారీగా పోలీసులను రప్పించడం ఏమిటి? దుర్వినియోగం అవుతున్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై శాంతియుతంగా చేపట్టనున్న నిరసన దీక్షకు ఈ ఆంక్షలు ఏమిటి?’’ అని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, పోలీసు అధికారులను ప్రశ్నించారు.