సీఎంగా యెడియూరప్ప మార్పు యోచనే లేదు

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీఎస్‌ యెడియూరప్ప (77) ను మార్చబోతున్నారని వస్తున్న వార్తలను బిజెపి నాయకత్వం కొట్టిపారవేసింది. ఇక ముందు కూడా ముఖ్యమంత్రిగా ఆయనే కొనసాగుతారని స్పష్టం చేసింది.బీజేపీ కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జి, జాతీయ ప్రధాన కార్యదర్శి  అరుణ్‌ సింగ్‌ ఈ విషయాని స్పష్టత ఇచ్చారు. 

‘ఆయన (యెడియూరప్ప) మన ముఖ్యమంత్రి  అని నేను పలుసార్లు చెప్పాను. ఇక ముందు ఆయన సీఎంగా కొనసాగుతారు. ఆయన సారథ్యంలోనే మేం ముందుకు వెళుతున్నాం. యెడియూరప్పసమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం పట్ల చర్యలు తీసుకుంటున్నారు. పార్టీలోని ప్రముఖ నేతల్లో ఆయన ఒకరు’ అని తెలిపారు.

అంతకు  ముందు యడ్డ్యూరప్ప సహితం రాష్ట్రంలో నాయకత్వ మార్పు ప్రసక్తి లేదని, మిగిలిన రెండున్నరేళ్ళపాటు తానే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ విషయమై బిజెపి నాయకత్వంలో ఎటువంటి గందరగోళం కూడా నెలకొనలేదని తేల్చి చెప్పారు.

గత ఏడాది అంతా తన ప్రభుత్వం ఒక విధంగా పకృతి వైపరరీత్యాలు, కరోనా మహమ్మారి, ఆర్ధిక సమస్యలతో  “అగ్ని పరీక్ష”కు గురయినదని అంటూ అభివృద్ధి  పధంలో కర్ణాటకకు దేశంలో మొదటి స్థానంలో ఉంచాలన్నదే తమ ప్రభుత్వం సంకల్పమని తెలిపారు. గత సంవత్సరంన్నర కాలంగా తాను తన పదవీకాలం గురించి ఒక్క రోజు కూడా పట్టించుకోలేదని, అభివృద్ధి పైననే దృష్టి సారిస్తూ వస్తున్నానని యడ్డయురప్ప పేర్కొన్నారు.

కాగా పార్టీకి సంబంధించిన అంశాలపై బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని పార్టీ నేతలను అరుణ్‌ సింగ్‌ ఈ సందర్భంగా హితవు చెప్పారు. ఊహాజనిత ప్రశ్నలకు తాను సమాధానం చెప్పబోనని స్పష్టం చేశారు.  కేంద్రంలో 2914లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీఎంలు, కేంద్ర మంత్రులను 75 ఏండ్లు పూర్తయిన తర్వాత తప్పించడం అప్రకటిత విధానంగా కొనసాగుతున్నది. అందుకనే కర్ణాటకలో నాయకత్వం మార్పు తప్పనిసరని కధనాలు కొంతకాలంగా వెలువడుతున్నాయి.

వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు సాధించాలని సీఎం యడియూరప్ప ఎమ్మెల్యేలకు టార్గెట్ విధించారు. ఇదే మిషన్‌తో నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. శివమొగ్గలో జరిగిన కోర్ కమిటీ సందర్భంగా సీఎం యడియూరప్ప పై విధంగా స్పందించారు. ఇదే పనిపై రాష్ట్రం మొత్తం చుట్టి వస్తానని ఆయన ప్రకటించారు. ‘‘ఇతర పార్టీపై ఆధారపడకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఏకైక లక్ష్యం. వచ్చే వారం నుంచి పర్యటనలు ప్రారంభం చేస్తా.’’ అని యడియూరప్ప ప్రకటించారు.