ఉర్మిళా మడోంద్కర్‌పై కంగనా రనౌత్‌ ఫైర్‌ 

రాజకీయ నాయకురాలి అవతారమెత్తిన సినీ నటి ఉర్మిళా మడోంద్కర్‌పై మరో నటి కంగనా రనౌత్‌ ఫైర్‌ అయ్యారు. మహారాష్ట్రలోని అధికార శివసేనలో చేరిన మూడు వారాల్లోనే రూ.3 కోట్లే కొనుగోలు చేయగలిగారని ఎద్దేవా చేశారు. రెండేండ్ల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నార్త్‌ ముంబై స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి ఊర్మిలా మండోద్కర్‌ ఓటమి పాలయ్యారు.

తర్వాత గతేడాది డిసెంబర్‌ ఒకటో తేదీన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సమక్షంలో ఊర్మిలా మండోద్కర్‌ శివసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మండోద్కర్‌ కొనుగోలు చేసిన భవనాన్ని కంగన తన ట్విట్టర్‌ ఖాతాలో జత చేసింది.

కాంగ్రెస్‌ పార్టీ సంకీర్ణ సర్కార్‌కు సారథ్యం వహిస్తున్న శివసేన తన కార్యాలయాన్ని కూల్చేస్తే, మాడోంద్కర్‌ మాత్రం తన మాజీ పార్టీతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారని, అందువల్లే ఇల్లు కొనుగోలు చేయగలిగారని ధ్వజమెత్తారు. కానీ తాను బీజేపీకి మద్దతు తెలిపినందుకు తాను 25-30 కేసులను ఎదుర్కొంటున్నానని కంగనా చెప్పారు.

ఇల్లు కొనుగోలుకు సంబంధించి పత్రాలను చూపాలని ఊర్మిళ మడోంద్కర్‌ను కంగనా రనౌత్‌ నిలదీశారు. కంగనకు ఉర్మిళ కూడా ఘాటుగానే స్పందించారు. కోట్ల మంది పన్ను చెల్లింపు దారుల నుంచి వచ్చిన సొమ్ముతో కంగన రనౌత్‌కు కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాతిపదికన వై క్యాటగిరీ ప్రకారం భద్రత కల్పించారని కేంద్రాన్ని నిలదీశారు.