‘సర్‌’లో పేరు తొలగిస్తే ఓటేసేందుకు అవకాశం లేదు

‘సర్‌’లో పేరు తొలగిస్తే ఓటేసేందుకు అవకాశం లేదు
* ఓటు రాజ్యాంగ హక్కు మాత్రమే కాదు సెంటిమెంట్‌.. సుప్రీంకోర్టు 

‘సర్‌’ ప్రక్రియలో తొలగించిన ఓటర్లకు ఈసారికి ఓటు వేసే అవకాశం కల్పించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లో ‘సర్’ ప్రక్రియ అనంతరం లక్షలాది మంది ఓటర్లను ఎన్నికల సంఘం తొలగించిన సంగతి తెలిసిందే. తొలగించిన వారిలో పేర్లు కోల్పోయిన కొందరు ఓటర్ల తరఫున టీఎంసీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

`సర్’ ద్వారా ఓటు హక్కు కోల్పోయిన వారికి ఈ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని కోరుతూ టీఎంసీ నేత కల్యాణ్‌ బెనర్జీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంలో 1.6 మిలియన్ల ఓటర్ల అభ్యర్థనలు సంబంధిత వ్యవస్థల వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వారందరికీ ఓటు వేసే అవకాశం ఇవ్వాలని కోరారు.  దీనిపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ జరిపింది. ఇది సాధ్యం కాని విషయం అని కోర్టు పేర్కొంది.

ఈ అంశం సంబంధిత ట్రిబ్యునల్స్ వద్ద పెండింగ్‌లో ఉందని, తాము జోక్యం చేసుకోవడం వల్ల వాటి న్యాయ ప్రక్రియకు భంగం కలుగుతుందని కోర్టు అభిప్రాయపడింది.  ‘సర్‌’లో ఓటు కోల్పోయిన వారికి అవకాశం కల్పిస్తే దీనిపై విచారణ జరుపుతున్న ట్రిబ్యునల్స్ మీద ఒత్తిడి పెరుగుతుందని, అనవసర, గందరగోళ పరిస్థితిని తాము సృష్టించలేమని తెలిపింది. ఇందుకు అనుమతిస్తే, దీనితో సంబంధం ఉన్న ఇతరుల ఓటు హక్కుల్ని తొలగించినట్లవుతుంది అని కోర్టు వ్యాఖ్యానించింది.

ఇప్పటికే సర్‌కు సంబంధించి 3.4 మిలియన్ల అభ్యర్థనలు పెండింగ్‌లో ఉన్నాయని జస్టిస్ జోయ్‌మాల్యా తెలిపారు. ఈ నేపథ్యంలో తాము వారికి ఓటు వేసే అవకాశం కల్పించలేమని స్పష్టం చేసింది. ఎన్నికలకు ముందే పశ్చిమ బెంగాల్‌లో పలువురు పేర్లను ఓటర్ల జాబితా నుంచి ‘సర్’ అనంతరం ఈసీ తొలగించింది.  తుది ఓటర్ల జాబితా ప్రకటించింది. దీంతో ఎన్నికలకు ముందు ఇందులో కొత్త పేర్లు చేర్చడానికి అవకాశం లేదు. సుప్రీంకోర్టు ఆదేశిస్తే తప్ప ఈ విషయంలో మార్పు ఉండదు.

అయితే, ఇప్పుడు సుప్రీం కోర్టు మాత్రం దీనికి నిరాకరించింది. పశ్చిమ బెంగాల్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 23, 29 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి. మరోవంక, ఓటర్ల జాబితాలో పేరు వుండడం, మనం పుట్టిన సొంత దేశంలో ఓటు వేయడమనేది కేవలం రాజ్యాంగ హక్కు మాత్రమే కాదని సెంటిమెంట్‌తో కూడిన హక్కని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

‘తార్కిక వైరుధ్యాల’ కారణంగా లక్షలాది ఓటర్లను జాబితా నుండి మినహాయించడాన్ని, అసెంబ్లీ ఎన్నికలు కేవలం పది రోజులు వున్నాయనగా, తమ పేరు తొలగింపుపై విచారణల కోసం వారు ఎదురు చూస్తుండడాన్ని న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రస్తావించింది.  పేర్లు తొలగించిన ఓటర్లు దాఖలు చేసిన 34లక్షల అప్పీళ్లు 19 అప్పిలేట్‌ ట్రిబ్యునళ్ల ముందు విచారణకు వున్నాయని కోర్టు పేర్కొంది. ఈ ట్రిబ్యునళ్లలో ఒక్కోదాని ఎదుట లక్షకు పైగా అప్పీళ్లు పెండింగ్‌లో వున్నాయని తెలిపింది.

”ఓటర్ల జాబితాలో పేరు వుండి, మీరు పుట్టిన దేశంలో ఓటు వేసే హక్కును కలిగివుండడమనేది కేవలం రాజ్యాంగ హక్కే కాదని, అది సెంటిమెంట్‌తో కూడిన హక్కు.” అని జస్టిస్‌ జోమాల్యా బాగ్చి ఎన్నికల కమిషన్‌ను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. ‘ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రాతినిధ్య ప్రక్రియలో మీరు భాగస్వాములు కావడం జాతీయతకు, దేశభక్తికి అతిపెద్ద వ్యక్తీకరణగా నిలుస్తుంది.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
 
దానిపై ఇసి తరపు న్యాయవాది దామా శేషాద్రి నాయుడు స్పందిస్తూ, ఈ విషయంలో పశ్చిమ బెంగాల్‌ ప్రత్యేకంగా నిలవలేదని, పేర్ల తొలగింపు విషయంలో ఇతర రాష్ట్రాల మాదిరిగానే బెంగాల్‌లో కూడా తొలగింపులు చోటు చేసుకున్నాయని చెప్పారు.
 
 ‘పశ్చిమ బెంగాల్‌ ప్రత్యేకంగా నిలవడం గురించి మేం ఆందోళన చెందడం లేదు. కానీ మరే ఇతర రాష్ట్రంలోనూ ‘లాజికల్‌ డిస్క్రిపెన్సీ (తార్కిక వైరుధ్యం)’ అనే కేటగిరీ లేదు. బీహార్‌లో పరిశీలించాం, ఒక్క వ్యక్తిని కూడా ఈ కేటగిరీ కింద గుర్తించలేదు. ఇక్కడ ఎన్నికల కమిషన్‌ను పొగడ్తలతో ముంచెత్తే లేదా విమర్శలతో కుంగదీయడానికి సంబంధించిన ప్రశ్న కాదు. ఇసి నిష్పక్షపాతంగా వ్యవహరించిందా లేదా అన్నదే ప్రశ్న’ అని జస్టిస్‌ బాగ్చి పేర్కొన్నారు.