11 కోట్ల కుటుంబాల నుండి రామమందిర విరాళాలు 

శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్ర‌స్ట్‌ ఆధ్వర్యంలో అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా తలపెట్టిన నిధి సమర్పణ అభియాన్‌లో సంఘ పరివార్ పూర్తి స్థాయిలో నిమగ్నమై పనిచేస్తున్నారు.  దేశవ్యాప్తంగా ఉన్న 4 లక్షలకు పైగా గ్రామాలలో 11 కోట్లకు పైగా కుటుంబాలను ఇంటింటికి వెళ్లి హిందూ కార్యకర్తలు కలిసి అయోధ్యలో జరుగుతున్న శ్రీరామ మందిర నిర్మాణం కోసం భక్తుల నుండి నిధిని సేకరిస్తున్నారు. 
 
శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్‌ జాతీయ కన్వీనర్ శ్రీ అలోక్‌ కుమార్‌జీ ఈ కార్యక్రమం గురించి తెలిపిన వివరాలు: 
 
శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణం కోసం సేకరించబోవు నిధి కోసమై రూ.10, రూ.100, రూ.1000 కూపన్లు ముద్రించారు. రూ.2000 ఆపైన ఇచ్చే నిధికి రసీదు ఇస్తారు. తాము సమర్పించిన మొత్తానికి సెక్షన్‌ 80(జి) ద్వారా ఆదాయపుపన్ను నుండి మినహాయింపు పొందవచ్చు. 
 
ఐదు మంది కార్యకర్తలతో ఒక టీం చొప్పున నిధి సేకరణ కోసం బృందాలను ఏర్పాటు చేస్తున్నారు.  క్రింది స్థాయిలో నిధి ప్రముఖ్‌ ను ప్రత్యేకంగా నియమించి సేకరించిన నిధిని 48 గంటలలోపు తీర్ధ క్షేత్ర ట్రస్టు అకౌంట్‌లో డిపాజిట్‌ చేస్తారు. ప్రతీ నిధిప్రముఖ్‌కు ఒక ప్రత్యేక కోడ్‌ను కేటాయించి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుల ద్వారా ఆలయ ట్రస్టు అకౌంట్‌లో సేకరించిన నిధిని జమ చేస్తారు.  
 
నిధి సేకరణ పూర్తి పారదర్శక విధానంలో జరుగుతుంది. లార్సన్‌ అండ్‌ టర్బో సంస్ధ ద్వారా మందిర నిర్మాణం జరుగుతుంది. టాటా కన్సల్టెన్సీ, ఐఐటీ ముంబై, ఐఐటీ ఢిల్లీ ఐఐటీ చెన్నై ఐఐటీ గౌహతి, సీఈబీఆర్ఐ రూర్కెలా సంస్థల నుండి మందిర నిర్మాణానికి సాంకేతిక, ఇంజనీరింగ్‌ సహకారం లభిస్తుంది. దేవాలయాన్ని పూర్తిగా రాతి కట్టడాలతో నిర్వహిస్తారు. 
 
శ్రీ రామ జన్మభూమిలో 2.7 ఎకరాల స్థలంలో 57,406 చ.అడుగుల వైశాల్యంతో ప్రధాన మందిరం నిర్మాణం జరుగుతుంది. ప్రదాన మందిరం 860 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పుతో నిర్మాణం జరుగుతుంది. 3 అంతస్టులతో, 5 గోపురాలతో మందిరము ఉండబోతుంది. మొదటి అంతస్తులో 160 స్తంభాలు, రెండవ అంతస్తులో 182 స్తంభాలు,  మూడవ అంతస్తులో 74 స్తంభాలు నెలకొల్పడం జరుగుతుంది. 
 
2024వ సంవత్సరంలోపు ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి భక్తులకు భగవాన్‌ శ్రీరాముని దర్శనానికి ఆహ్వానించడానికి పూర్తి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ప్రధాన దేవాలయంతో పాటు 67. 33 ఎకరాల స్ధలంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో పుస్తక ప్రదర్శనశాల, ప్రాచీన వస్తువుల ప్రదర్శన, మ్యూజియం, పరిశోధన కేంద్రం, యజ్ఞశాల, వేద పాఠశాల, సత్సంగ భవనము, ప్రసాద వితరణ కేంద్రం, డిజిటల్‌ యాంపి థియేటర్‌, ధర్మశాల ఇతర సౌకర్యాలు కల్పనకు నిర్మాణాలు చేపట్టడం జరిగింది. 
 
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో నిర్మాణమవుతున్న మందిరాన్ని కేవలం ఒక మందిరంగా విశ్వహిందూ పరిషత్‌ భావించడంలేదు. ఇది జాతి స్వాభిమాన మందిరంగా భావిస్తున్నాము. ఈ నిర్మాణం ద్వారా భారతీయ ఆత్మను సమాజంలో తిరిగి ప్రతిష్టించడం జరుగుతుంది. ఈ ప్రేరణ సమాజం ఎదుర్కొంటున్న అనేక రుగ్మతలను రూపుమాపుతుంది. 
 
సమాజంలో సామాజిక సమరసతను నెలకొల్పడం, పేదరిక నిర్మూలన, విద్య, వైద్యం మరియు వృత్తి నైపుణ్యం ప్రతి ఒక్కరికి అందించడం మహిళల సాధికారత సాధించడం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న తీవ్రవాద భావజాలాన్ని రూపుమాపడం వేదాలు ప్రభోదంచిన “సర్వే భవంతు సుఖినః’ అన్నదాన్ని సాధించడానికి అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా, ఎలాంటి బాధలు లేని సమాజాన్ని తీర్చిదిద్దడానికి రామాలయం ప్రేరణగా నిలుస్తుంది.