భార‌త్‌లో ప్ర‌పంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ   

భార‌త్‌లో ప్ర‌పంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్య‌క్ర‌మం ప్రారంభం కాబోతున్న‌ద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ తెలిపారు. జాతీయ తూనిక‌లు, కొల‌త‌ల శాఖ స‌మావేశంలో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా పాల్గొంటూ ఆయన దేశంలోని శాస్త్ర‌వేత్త‌ల‌ను అభినందించారు. స్వ‌దేశంలో కొవిడ్‌ టీకాల‌ను అభివృద్ధి చేయడంలో మ‌న శాస్త్ర‌వేత్త‌లు విజ‌య‌వంత‌మ‌య్యార‌ని కొనియాడారు. రెండు స్వ‌దేశీ వ్యాక్సిన్‌ల‌ను అందుబాటులోకి తెచ్చిన శాస్త్ర‌వేత్త‌ల‌ను చూసి దేశం గ‌ర్విస్తోందని చెప్పారు.
 
  ఈ అసాధారణమైన కృషి చేసిన మన శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు దేశ ప్రజలందరు రుణపడి ఉంటారని ప్రధాని చెప్పారు. వారిని చూసి దేశం గర్విస్తోందని తెలిపారు.  క‌రోనా వ్యాక్సిన్ ఉత్ప‌త్తి నేప‌థ్యంలో మేకిన్ ఇండియా గురించి మాట్లాడిన ప్ర‌ధాని మ‌నం త‌యారుచేసే ఉత్ప‌త్తుల‌కు ప‌రిమాణం ఎంత ముఖ్య‌మో, నాణ్య‌త కూడా అంతే ముఖ్య‌మ‌ని స్పష్టం చేశారు.
కేవలం ప్రపంచ మార్కెట్ లలో భారతీయ ఉత్పత్తులను నింపడం పట్ల కాకుండా,  వాటి నాణ్యత, విశ్వసనీయతలను చూసి ప్రతి కొనుగోలుదారుడు సంతృప్తి వ్యక్తం చేసినప్పుడే మనకు గర్వకారణం కాగలదని ప్రధాని పేర్కొన్నారు.  అదే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అని చెప్పారు.
నాణ్య‌త‌, విశ్వ‌స‌నీయ‌త‌గ‌ల ఉత్ప‌త్తుల‌ను తీసుకొస్తూ మ‌న బ్రాండ్ భారత్  మ‌రింత బ‌లోపేతం చేయాల‌ని సూచించారు. మేకిన్ ఇండియా ఉత్ప‌త్తుల‌కు డిమాండ్‌తోపాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆమోదం ల‌భించేలా కృషి చేయాల‌ని చెప్పారు. గ్లోబ‌ల్ ఇన్నోవేష‌న్ ర్యాంకింగ్స్‌లో భార‌త్ టాప్ 50 దేశాల్లో ఒక‌టిగా నిలిచింద‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు.
ప్ర‌స్తుతం ప‌రిశ్ర‌మ‌, సంస్థ‌ల మ‌ధ్య స‌హ‌కారం మ‌రింత బ‌ల‌ప‌డుత‌న్న‌ద‌ని ఆయ‌న చెప్పారు. అందుకే స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌లు వ‌స్తున్నాయ‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ప్ర‌ధాని నేష‌న‌ల్ అటామిక్ స్కేల్‌, నిర్దేశ‌క్ ద్ర‌వ్య‌ల‌ను ప్ర‌ధాని మోదీ ప్రారంభించారు. ‌