మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోనూ ల‌వ్ జిహాద్ ఆర్డినెన్స్‌

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోనూ ల‌వ్ జిహాద్ ఆర్డినెన్స్‌

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం కూడా ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్రభుత్వాన్ని అనుసరిస్తూ ల‌వ్ జిహాద్ ఆర్డినెన్స్‌కు మంగ‌ళ‌వారం కేబినెట్ ఆమోదం తెలిపింది. వెంట‌నే గ‌వ‌ర్న‌ర్ ఆనందిబెన్ ప‌టేల్ ఆమోదం కోసం పంపించింది. 

పెళ్లి త‌ర్వాత బ‌ల‌వంత‌పు మ‌త మార్పిడుల‌ను ఈ ఆర్డినెన్స్ నిరోధిస్తుంది. దీనికి మ‌త స్వేచ్ఛ బిల్లు 2020 అని పిలుస్తున్నారు. పెళ్లి కోసం బ‌ల‌వంతంగా యువ‌తుల మ‌తం మార్చే ప్ర‌య‌త్నం చేస్తే గ‌రిష్ఠంగా ప‌దేళ్ల జైలు శిక్ష‌, రూ.ల‌క్ష వ‌ర‌కు జరిమానా విధించ‌నున్నారు. 

ఈ ఆర్డినెన్స్‌లోని నిబంధ‌న‌ల‌ను ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ స్వ‌యంగా మంత్రుల‌కు వివ‌రించారు. ఇందులో కొన్ని మార్పులు చేయాలంటూ గ‌త వారం హోంశాఖ సిద్ధం చేసిన డ్రాఫ్ట్‌ను చౌహాన్ తిర‌స్క‌రించారు. వ‌చ్చే ఆరు నెల‌లలోపు ఈ ఆర్డినెన్స్‌ను చ‌ట్టం రూపంలోకి మార్చేందుకు అసెంబ్లీలో బిల్లు ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.

యువ‌త‌ను బెదిరించ‌డం, పెళ్లి చేసుకుంటాన‌ని చెప్ప‌డం, డ‌బ్బు ఆశ చూప‌డం, లేదా ఇత‌ర అక్ర‌మ మార్గాల ద్వారా మ‌తం మార్చాల‌ని చూసిన వారికి రూ.25 వేల జ‌రిమానా, ఐదేళ్ల వ‌ర‌కు జైలు శిక్ష విధించ‌నున్న‌ట్లు ఈ ఆర్డినెన్స్ స్ప‌ష్టం చేసింది. స‌ద‌రు యువ‌తి ఎస్సీ, ఎస్టీ వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి అయితే జ‌రిమానా రూ.50 వేల వ‌ర‌కు ఉంటుంది. ఇక సామూహిక మ‌త మార్పిడులు చేసే వారికి రూ. ల‌క్ష వ‌ర‌కు జరిమానా విధించ‌నున్నారు.