ఏపీలో మరో దేవతా విగ్రహం చేతులు నరికివేత 

ఏపీలోని దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత రామతీర్థం ఆలయంలో కోదండరామ ఆలయంలో శ్రీరాముడి విగ్రహం తలను నరికేసిన ఘటన మరువక ముందే… తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి  శ్రీరామనగర్‌లో ఉన్న విఘ్నేశ్వరాలయంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఉపాలయంలో స్వామి వారి విగ్రహం రెండు చేతులను దుండగులు నరికివేశారు. 

దీంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరుచుగా విగ్రహాల ధ్వంసంతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు.  విగ్రహాల ధ్వంసంపై ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.  

కాగా, ఏపీలో జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమని ఏపీ బీజేపీ కో ఇంచార్జ్ సునీల్ దియోధర్ విచారం  వ్యక్తం చేశారు. అయోధ్యలో రామాలయం నిర్మిస్తూ ఉంటే…రామతీర్ధంలో శ్రీరాముని తలనరకడం బాధాకరమని మండిపడ్డారు. ఆలయాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని స్పష్టం చేశారు. ఏపీలో ఆలయాల భద్రతను ప్రభుత్వం గాలికి వదిలేసిందని సునీల్ మండిపడ్డారు.