ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు శిక్ష!

శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులకు హైకోర్టు శిక్ష ఖరారు చేసింది. గురువారం కోర్టు పనిగంటలు ముగిసేవరకు కోర్టులోనే కూర్చోవాలని ఆదేశించింది. రూ.1000 జరిమానా వేసింది. ఆ సొమ్మును చెల్లించని పక్షంలో వారం రోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. 

కోర్టు ధిక్కరణ కేసులో న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ గురువారం ఈ తీర్పు వెలువరించారు. నిజానికి… మొదట నెల రోజులు సాధారణ జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధించారు.  తన వయస్సు, ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని శిక్షను తగ్గించాలని బాలకృష్ణమాచార్యులు వేడుకున్నారు. 

భవిష్యత్తులో కోర్టు తీర్పుల అమలులో జాప్యం లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఆ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి మానవతా దృక్పథంతో తీర్పును సవరించారు. పనిగంటలు ముగిసేవరకు కోర్టు హాలులో కూర్చోవాలని ఆదేశించారు. శాసనసభలో పనిచేసే పిటిషనర్లకు(టైపిస్టులు, ఆఫీసు అసిస్టెంట్లు) ఇంక్రిమెంట్లు, జీతాలు ఇచ్చే వ్యవహారంపై 2017 ఫిబ్రవరిలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులు అమలు చేయలేదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

ఈ వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన కోర్టు సకాలంలో బిల్లులు సమర్పించకుండా శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని కోర్టు నిర్ధారించింది. గురువారం ఈ వ్యవహారం పై  తుది తీర్పు వెల్లడించింది. కోర్టు ఆదేశాల మేరకు బాలకృష్ణమాచార్యులు గురువారం పనిగంటలు ముగిసేదాకా కోర్టు హాలులో కూర్చున్నారు.