కరోనా మహమ్మారితో వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి చెందారు. గత కొన్నిరోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
గత నెల 13న కరోనాతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కాగా.. ఆయన మృతిపట్ల సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పలువురు నేతలు, కర్నూలు జిల్లా వైసీపీ నేతలు సంతాపం తెలియజేశారు. చల్లా అంత్యక్రియలు అవుకులో జరగనున్నాయి. ఈ అంతిమ సంస్కారాలకు జిల్లా నేతలతో పాటు, పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు.
కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ పార్టీల్లో ఈయన కీలక నేతగా ఉన్నారు. కర్నూలు జిల్లాలో సీనియర్ నేతగా ఆయనకు మంచి పేరుంది. టీడీపీ హయాంలో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్‌గా చల్లా చేశారు. ఆ తర్వాత పార్టీ సభ్యత్వం, సివిల్ సప్లై కార్పొరేషన్ పదవులకు రాజీనామా చేసి వైసీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌గు గుడ్ బై చెప్పిన చల్లా టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. అయితే సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు చల్లా రామకృష్ణారెడ్డి టీడీపీకి టాటా చెప్పేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీనియర్ నేత, జిల్లాలో కీలక నేత కావడం, పలు నియోజకవర్గాల్లో ఆయనకు మంచి కేడర్ ఉండటంతో వైసీపీ అధిష్టానం ఆయన్ను ఎమ్మెల్సీని చేసింది.
ఈయన 1983లో పాణ్యం ఎమ్మెల్యేగా గెలిపొందారు. 1989లో డోన్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1991లో నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. 1994లో కోవెలకుంట్ల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే చేతిలో ఓడిపోయారు.
ఆ తర్వాత 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు కర్రా సుబ్బారెడ్డి, ఎర్రబోతులను ఓడించి,రెండు పర్యాయాలు భారీ మెజార్టీతో గెలుపొందారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కోవెలకుంట్ల స్థానం కనుమరుగయ్యింది. 2014 ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి టికెట్ రాకపోవడంతో టీడీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థి బీసీ జనార్దనరెడ్డిని ఒంటి చేత్తో గెలిపించారు.

More Stories
పుట్టపర్తి యుద్ధ విమానాలతో మారనున్న రాయలసీమ తలరాత
దక్షిణ తీర రైల్వే జోన్ ఏపీ అభివృద్ధికి మైలురాయి
జూన్ 1 నుండి “దక్షిణ తీర రైల్వే”