* హిందువులను రెచ్చగొట్టేందుకే `రావణ్’గా పేరు పెట్టుకున్న యూట్యూబర్ జోసఫ్
గన్నవరం పోలీసులు ఉపా చట్టం కింద కేసు నమోదు చేసిన యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ రిమాండ్ రిపోర్టులో విద్యార్థులు, యువతను రావణ్ రెచ్చగొడుతున్నారని, యువతను మావోయిస్టు సంస్థ వైపు ఆకర్షితులను చేసే ప్రకటనలు చేస్తున్నారని, మతపరమైన విభేదాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
రావణ్ ఫోన్‌లో మావోయిస్టు భావజాలం ఉన్నట్లు గుర్తించామని, హిడ్మాను పొగుడుతూ ప్రసంగాలు చేశారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అశాంతి సృష్టించాలనే ఉద్దేశం రావణ్‌లో ఉందని, వ్యవస్థ మీద విద్వేషం, వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. విచారణకు రావణ్ సహకరించడం లేదన్న పోలీసులు అతనికి సహకారం అందిస్తున్నవారెవరో కనిపెట్టాల్సి ఉందని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.
గన్నవరం జనసేన నేత గరికపాటి శివశంకర్ ఫిర్యాదు ఆధారంగా రావణ్ మీద బీఎన్ఎస్ సెక్షన్లతో పాటుగా, ఉపా చట్టంలోని సెక్షన్ల కింద గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలమంచిలి కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆదివారం రోజు సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు.
ఈ సందర్భంగా ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రశ్న రావణ్‌కు జులై 18వ తేదీ వరకూ రిమాండ్ విధించగా నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. సామాజిక మాద్యమాల ముసుగులో యువతను రెచ్చగొడుతూ, రాజ్యంపై యుద్ధం చేసేలా కుట్ర పన్నుతున్న ‘ప్రశ్న’ యూట్యూబ్ ఛానల్ డైరెక్టర్ ‘రావణ’ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించారు.
గన్నవరం పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన ఈ నివేదికలో నిందితుడిపై మోపిన తీవ్రమైన ఆరోపణలు, అతడి కుట్రపూరిత వ్యవహార శైలిని పూసగుచ్చినట్లు వివరించారు. దేశ భద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరిస్తున్న ఇతనిపై అత్యంత కఠినమైన ‘ఉపా’, దేశద్రోహం చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.
నిరుద్యోగ యువతను, విద్యార్థులను రెచ్చగొట్టి నిషేధిత ఉగ్రవాద సంస్థ సీపీఐ మావోయిస్టు వైపు ఆకర్షితులయ్యేలా నిందితుడు నిరంతరం ప్రకటనలు చేస్తున్నాడని పేర్కొన్నారు.
నిందితుడి అసలు పేరు బత్తలకురి జోసెఫ్. కానీ, కావాలనే ‘రావణ’ అనే పేరు పెట్టుకున్నాడని పేర్కొంటూ హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, పవిత్ర ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలను కించపరిచి మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టాలనే కుట్రలో భాగమే ఈ పేరు మార్పు అని పోలీసులు నిర్ధారించారు.
సామాజిక, మతపరమైన విభేదాలను రెచ్చగొట్టేలా నిందితుడు వ్యవస్థీకృతంగా వ్యవహరిస్తున్నాడని ఇటీవల ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమావేశంలో అత్యంత అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని పేర్కొన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టి, రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలనే కుట్ర ఇతనిలో స్పష్టంగా కనిపించిందని పోలీసులు తెలిపారు.
రాష్ట్రంలో అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులను ఉద్దేశపూర్వకంగా దూషించాడని, ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల్లో ద్వేషం, వైషమ్యాలు సృష్టించేలా పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమైన భాషను ఉపయోగించాడని ఆరోపించారు. హైదరా బాద్‌లోని అమీన్‌పూర్‌కు చెందిన 37 ఏళ్ల జోసెఫ్‌పై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏలూరు, కాకినాడ, అనకాపల్లి, విజయవాడ తదితర ప్రాంతాల్లో మొత్తం 9 కేసులు నమోదయ్యాయి.
నిందితుడు తప్పించుకు తిరుగుతుండగా జూలై 4న అనకాపల్లి జిల్లా జిల్లా వెంపాడు టోల్ ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశద్రోహానికి పాల్పడుతున్న రావణ్‌కు తెరవెనుక ఉండి ఆర్థికంగా, ఇతరత్రా సహకరిస్తున్న వ్యక్తులు, శక్తులు ఎవరో తేల్చాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున సాక్ష్యాలను తారుమారు చేయకుండా 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించాలని కోరారు.
రావణ్‌ను పది రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని గన్నవరం పోలీసులు కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్,, ఇతర సోషల్ మీడియాలో రావణ్‌కు అకౌంట్లు ఉన్నాయి. వాటిని ఉపయోగిస్తున్న ఎలకా్ట్రనిక్ పరికరాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. గూగుల్ తదితర సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీచేసి లాగిన్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు, యూజర్ ఐడీలు, ఐపీ లాగ్‌లు తెలుసుకోవాల్సి ఉందని తెలిపారు.

More Stories
చంపత్ రాయ్ రాజీనామా ఆమోదం.. కొత్త సారధిగా కృష్ణ మోహన్
జూన్ లో విద్యుత్ వాహనాల వాటా 12.5 శాతంకు పెరుగుదల
తెల్లారితే పుట్టినరోజు.. క్లబ్ డ్యాన్సర్ అనుమానాస్పద మృతి