బిజెపి కార్యకరతలు నిరంతరం ప్రజలతో మమేకం కావాలని, వారితో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని, వారి సమస్యల పరిష్కారంకు కృషి చేయాలని, అలాగే ఎన్డీఏ ప్రభుత్వ అభివృద్ధి పథకాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరేలా చూడాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పిలుపిచ్చారు. జాతీయ అధ్యక్షునిగా నియమితులైన తరువాత తొలిసారి మంగళవారం విశాఖపట్నం వచ్చిన సందర్భంగా రాష్ట్ర బిజెపి కార్యవర్గ సమావేశంలో పాల్గొని పార్టీ నాయకులు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని చెప్పారు. ప్రతిపక్షాల ప్రతికూల రాజకీయాలకు ప్రజాస్వామ్యయుతంగా స్పందించాలని సూచిస్తూ, బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలను కోరారు. వెంకయ్య నాయుడు పార్టీ కోసం గోడలపై పోస్టర్లు అంటించే స్థాయి నుంచి అదే పార్టీకి జాతీయ అధ్యక్షుడు అయ్యారని చెబుతూ ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని సూచించారు.
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి పరుగులు తీస్తోందని చెబుతూ ఈ విజయవంతమైన పథకాలలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు. భారతదేశం భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని నితిన్ నబిన్ పేర్కొన్నారు. పార్క్ హోటల్ జంక్షన్ దగ్గరున్న వాజపేయి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బి.ఎల్. సంతోష్, జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) శివ్ ప్రకాష్, జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డి. పురందేశ్వరి, కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, ఆంధ్రప్రదేశ్ మంత్రి వై. సత్య కుమార్, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నబిన్ హెచ్చరించారు. సమాజ వ్యతిరేక శక్తులను ప్రోత్సహించే ధోరణి కలిగిన ప్రతిపక్షం దేశం ముందు ఉందని అయన విమర్శించారు. పార్లమెంటులో ప్రతిపక్షం వ్యవహరించిన తీరు, ఆగస్టు 15న కాంగ్రెస్ నాయకులు ప్రదర్శించిన ప్రవర్తన దేశ ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా ఉన్నాయని ఆయన ధ్వజమెత్తారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీపై ప్రతిపక్ష నాయకుడు ఉపయోగించిన భాష అందరికీ ఆందోళన కలిగించే అంశమని ఆయన అభివర్ణించారు. బీజేపీ కార్యకర్తలు తమ హుందాతనం, విలువలకు ప్రసిద్ధి చెందారని చెబుతూ అయితే ప్రతిపక్ష నాయకులు వాడిన భాషను ప్రజల ముందు గట్టిగా తిప్పికొట్టేటప్పుడు తమ సొంత ప్రవర్తన, మాటలలో హుందాతనం, సంయమనం పాటించాలని సూచించారు.
ప్రతిపక్ష నాయకుల మాటలు వారి విలువలనే ప్రతిబింబిస్తాయని, అటువంటి వ్యాఖ్యలు వారి నిరాశ, అసహనం నుండే పుట్టుకొస్తాయని నబిన్ విమర్శించారు. ప్రతిపక్ష నాయకుల అజెండా పూర్తిగా వారి స్వప్రయోజనాల చుట్టూనే తిరుగుతోందని పేర్కొంటూ బీజేపీ “దేశం మొదట – స్వయం చివర” అనే సూత్రాన్ని పాటిస్తుంటే, కాంగ్రెస్ నాయకులు మాత్రం “స్వయం మొదట – దేశం చివర” అనే సూత్రాన్ని అనుసరిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
బిజెపి కేవలం అధికారం కోసం కాకుండా ఒక సిద్ధాంతం కోసం ఏర్పడిందని, తన సిద్ధాంతమే తన బలం అని భావించిందని తెలిపారు. సిద్ధాంతం, త్యాగం, మరియు అంకితభావంతో కూడిన ఈ ప్రయాణం “దేశమే ప్రథమం” అనే సూత్రంతో ముడిపడి సాగిందని చెప్పారు. ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త—మండల, జిల్లా లేదా రాష్ట్ర స్థాయిలలో పనిచేస్తున్నవారైనా సరే—సంస్థను బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
బీజేపీ భారతదేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే సంకల్పాన్ని స్వీకరించడానికి మొత్తం 965 మండలాల అధ్యక్షులు హాజరయ్యారని చెబుతూ ఇందుకోసం ఆయన కార్యకర్తలందరినీ అభినందించారు. పోరాటాన్ని స్వీకరించడం, సంస్థను నిర్మించాలనే సంకల్పం, ప్రజల్లోకి వెళ్ళే విధానం వంటివే నేడు భారతీయ జనతా పార్టీ 22 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి, అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వరుసగా మూడవసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కారణమయ్యాయని నబిన్ స్పష్టం చేశారు.
ఏపీలో 2024 ఎన్నికలలో 25 లోక్‌సభ స్థానాలకు గాను 21 స్థానాలను ఎన్డీయే కూటమి గెలుచుకుందని, అలాగే 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164 స్థానాలను కైవసం చేసుకుందని నబిన్ పేర్కొన్నారు. ఈ గణాంకాలు మరింత పోరాటానికి కట్టుబడి ఉండేలా సంస్థకు స్ఫూర్తినిస్తాయని, ఈ విజయం పార్టీని ముందుకు నడిపించే ఒక సవాలు మరియు బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 945 మండలాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఇదే ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాలన్నీ క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లాలని సూచించారు. బీజేపీని రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కోరారు. కుమ్మరి, కమ్మరి, యాదవ, గీత ఇలా ప్రతి సామాజిక వర్గానికి పార్టీ అనుసంధానం కావాలని చెప్పారు. ‘అంతా కలిసి పనిచేద్దాం…ప్రతి గ్రామంలో కమలం వికసింపజేద్దాం’ అని నినదించారు. విశాఖకు రైల్వే జోన్ ఇచ్చినందుకు, పోలవరం నీరు త్వరగా అందిస్తున్నందుకు ధన్యవాద తీర్మానం చేశారు.
ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక మక్కువ చూపిస్తున్నారని, అడిగిన ప్రాజెక్టులు, కోరిన నిధులు ఇస్తున్నారని, అందుకే డబుల్ ఇంజన్ సర్కార్‌లో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తున్నదని, ఈ విషయాలను ప్రజల్లోకి నిరంతరం తీసుకువెళ్లాలని హితవు పలికారు. రాష్ట్రం నుంచి జాతీయ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరిని వి కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా సత్కరించారు. ఆ ప్రాంగణంలో 28 జిల్లాల నాయకులతో ప్రత్యేకమైన స్టాళ్లు ఏర్పాటుచేసి ప్రదర్శన నిర్వహించారు. వాటిని జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సందర్శించి ఆయా జిల్లాల ప్రత్యేకతలను తెలుసుకున్నారు.
ప్రతి జిల్లాకు గుర్తుగా అక్కడ లభించే ఉత్పత్తులను సమావేశానికి వచ్చిన పార్టీ నాయకులకు బ్యాగులో పెట్టి పంపిణీ చేశారు. పలాస జీడిపప్పు, అనకాపల్లి బెల్లం, ఏటికొప్పాక బొమ్మలు వంటివి అందులో ఉన్నాయి. విశాఖపట్నంలో అగ్రశ్రేణి నాయకులతో భారీ సమావేశం నిర్వహించడం వల్ల పార్టీ మరింతగా ప్రజల్లోకి వెళుతుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కార్యకర్తలకు నాయకులు సూచించారు.
కాగా, నితిన్ నబిన్ విశాఖలోయువతతో ‘వికసిత్ భారత్…యువ సంవాద్’ కార్యక్రమంలో పాల్గొని దేశ భవిష్యత్తు యువతతోనే ముడిపడి ఉందని చెప్పారు. వారు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అక్కడే రాత్రి ఏడు గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ అగ్రనేతలతో సమావేశం నిర్వహించి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకువెళ్లాలో సూచించారు. కూటమి నిబంధనలకు లోబడి పనిచేయాలని హితవు పలికారు. బిజెపి అధ్యక్షుడు నితిన్ నబిన్ ఉదయమే సింహాచలంలోని వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు.

More Stories
ఆర్థిక, వ్యక్తిగత కారణాలతోనే బిజెపికి రాజీనామా
సిపిజే నిరసనలో పొలిసు ప్రవర్తనపై `సుప్రీం’ ఉన్నతస్థాయి కమిటీ
రియల్ ఎస్టేట్ బ్రోకర్లా మారిన రేవంత్ రెడ్డి