* ప్రభుత్వం నుండి నివేదికకోరిన ఎన్‌హెచ్‌ఆర్‌సి
పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న పంజాబ్ ప్రభుత్వ పాఠశాలల్లో జెండా ఎగురవేయడం, జాతీయ గీతం ఆలపించడం వంటి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించడం లేదని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) సభ్యుడు ప్రియాంక్ కనూంగో బుధవారం తెలిపారు. “పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న పంజాబ్ ప్రభుత్వ పాఠశాలల్లో జెండా ఎగురవేయడం, జాతీయ గీతం ఆలపించడం వంటి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించడం లేదు. ఈ లోపం గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలపై అసమానంగా ప్రభావం చూపుతోంది. పాఠశాలల్లో ఇటువంటి కార్యక్రమాలను తప్పనిసరి చేసే రాజ్యాంగం మరియు భారత జెండా నియమావళి ప్రకారం వారి హక్కులను ఇది ఉల్లంఘిస్తోంది” అని ఆయన స్పష్టం చేశారు.
“పిల్లల్లో దేశభక్తిని పెంపొందించనందుకు, ఈ కార్యక్రమాలను నిర్వహించడంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం విఫలమవడం ఒక రకమైన ప్రభుత్వ నిర్లక్ష్యం, దేశద్రోహం కూడా” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరణాత్మక నివేదిక, చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసినట్లు కనూంగో తెలిపారు. “వివరణాత్మక నివేదిక మరియు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసాము. కేంద్ర విద్యా, హోం మంత్రిత్వ శాఖలకు కూడా సమాచారం అందించి, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరడం జరిగింది,” అని ఆయన తెలిపారు.
మంగళవారం, పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పాటించకపోవడంపై వచ్చిన ఫిర్యాదును ప్రియాంక్ కనూంగో నేతృత్వంలోని ఎన్‌హెచ్‌ఆర్‌సి బెంచ్ సుమోటోగా స్వీకరించి, పంజాబ్ ప్రభుత్వం నుంచి వివరణాత్మక నివేదికను కోరింది. గ్రామీణ, మారుమూల, సరిహద్దు ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించలేదని, దీనివల్ల ఆ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు జాతీయ వేడుకల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆ ఫిర్యాదు ప్రత్యేకంగా ఆందోళన వ్యక్తం చేసింది.
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల పిల్లలకు లభించిన విద్యాపరమైన, సాంస్కృతిక, పౌరపరమైన అవకాశాలు (స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించినవి) సరిహద్దు, మారుమూల ప్రాంతాల పిల్లలకు కూడా లభించాయా లేదా అని పరిశీలించాలని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర, జిల్లా, పాఠశాలల వారీగా వివరాలను అందించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కోరారు.
ఇందులో జాతీయ జెండా ఎగురవేసిన, జాతీయ గీతం ఆలపించిన, విద్యార్థులు వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య వంటి వివరాలు ఉండాలి. నిర్దేశించిన కార్యక్రమాలు నిర్వహించని పాఠశాలలను గుర్తించి, ఆ విధంగా జరగకపోవడానికి గల కారణాలను వివరించాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించారు. గ్రామీణ, మారుమూల, సరిహద్దు ప్రాంతాల్లోని పాఠశాలలను ప్రత్యేకంగా పరిశీలించాలని, ఆయా ప్రాంతాల పిల్లలకు లభించే అవకాశాలలో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే వాటి వివరాలను అందించాలని ధర్మాసనం కోరింది.
స్వాతంత్ర్య దినోత్సవం వంటి జాతీయ సందర్భాలు పిల్లలకు భారతదేశ స్వాతంత్ర్య పోరాటం, రాజ్యాంగం, జాతీయ చిహ్నాలు, పౌర బాధ్యతలు, జాతీయ సమైక్యత, ప్రజాస్వామ్య విలువల గురించి తెలుసుకోవడానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని కల్పిస్తాయని ధర్మాసనం పేర్కొంది. నాలుగు వారాల్లోగా సమగ్ర చర్యల నివేదికను సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
అలాగే, భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ నుండి సంబంధిత సమాచారాన్ని కోరడంతో పాటు, తగిన చర్యల కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. కేవలం పాఠశాలలు ఉన్న భౌగోళిక ప్రాంతం కారణంగా సరిహద్దు ప్రాంతాల పిల్లలకు జాతీయ పండుగ వేడుకల్లో పాల్గొనే సమాన అవకాశాలు నిరాకరించబడ్డాయా లేదా అని నిర్ధారించుకోవాలని ఎన్ హెచ్ ఆర్ సి ప్రయత్నిస్తోంది.

More Stories
బిజెపి శ్రేణులు నిరంతరం ప్రజలతో మమేకం కావాలి
ఆర్థిక, వ్యక్తిగత కారణాలతోనే బిజెపికి రాజీనామా
సిపిజే నిరసనలో పొలిసు ప్రవర్తనపై `సుప్రీం’ ఉన్నతస్థాయి కమిటీ