రాష్ట్రంలో బీజేపీని మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో కార్యాచరణ రూపొందిస్తున్నామని, అధికార ప్రతినిధులు పదునైన పదజాలంతో పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. బీజేపీ అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టుల కోసం నిర్వహించిన రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటూ ఇది అధికార ప్రతినిధులకు నిర్వహిస్తున్న రెండో రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ అని తెలిపారు.
రాష్ట్రంలో విద్రోహ శక్తులు వివిధ రూపాల్లో పనిచేస్తున్నాయని, దళితవాదం పేరుతో కొత్త ముసుగులు ధరించి హిందూ దేవతలను కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. మతాల పేరుతో చిచ్చు పెట్టడం, బలవంతపు మత మార్పిడులకు ప్రోత్సాహం ఇవ్వడం వంటి చర్యలను సమాజం ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
ప్రపంచంలో అన్ని మతాలను గౌరవించి, రక్షణ కల్పించిన దేశం భారతదేశమేనని, అయినప్పటికీ దేశంపై కుట్రలు జరుగుతున్నాయని హెచ్చరించారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో విమర్శలు చేయడం వేరు, విద్వేషాలు రెచ్చగొట్టడం వేరని స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే హక్కు అందరికీ ఉన్నప్పటికీ, ఉగ్రవాదానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం, సామాజిక విద్వేషాలను ప్రేరేపించడం అంగీకారయోగ్యం కాదని తేల్చి చెప్పారు.
సోషల్ మీడియా వేదికలను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ధర్మాన్ని కాపాడుకుంటూనే పరమతాలను గౌరవించాలని, కుట్రపూరితంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. చైనాలో భావ ప్రకటనా స్వేచ్ఛ లేదని పేర్కొంటూ కమ్యూనిస్టు విధానాలను విమర్శించారు. మోదీ–చంద్రబాబు నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వేగం తీసుకొచ్చిందని చెప్పారు.
ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో భారీ ప్రాజెక్టులు అమలవుతున్నాయని, మూడు గ్రీన్ కారిడార్లు, ఎకనామిక్ కారిడార్లు, సోలార్ విద్యుత్ విస్తరణ, గూగుల్ డేటా సెంటర్, స్టీల్ ప్లాంట్ వంటి పెట్టుబడులు రాష్ట్ర భవిష్యత్తును మార్చనున్నాయని వివరించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని, వచ్చే ఎన్నికల నాటికి పోలవరం జలకళతో కళకళలాడుతుందని తెలిపారు.
మచిలీపట్నం పోర్టు అభివృద్ధి, అమరావతి నిర్మాణం, కడప స్టీల్ ప్లాంట్ వంటి ప్రాజెక్టులతో రాష్ట్రానికి భారీ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. రెండేళ్లలో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని పేర్కొంటూ, అభివృద్ధిని అడ్డుకునే కుట్రలను ప్రజలంతా కలిసి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
మంత్రి వై సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సానుకూల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు కుల, మత విద్వేషాలను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. చట్ట పరిధిలో విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పక్క రాష్ట్రాల నుంచి వీడియో సందేశాల ద్వారా కూడా విద్వేష ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు.
మత ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధం కావని తెలిసినా కొందరు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హిందూత్వ మూలాలను దెబ్బతీసేలా మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు చేశారని, అమరావతి నుంచి మూడు రాజధానులు, ఇప్పుడు “మావిగన్” వంటి అసంబద్ధ వాదనలు ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి పార్టీలు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాయని, గ్రామీణ–పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధినే ప్రధాన అజెండాగా తీసుకుని ముందుకు వెళ్తామని తెలిపారు. త్వరలో మూడు పార్టీల సమన్వయ సమావేశం నిర్వహించి అభ్యర్థుల ఎంపికపై నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు.
బీజేపీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ అధికార ప్రతినిధులు ప్రజా సమస్యలపై వాస్తవాధారితంగా స్పందించాలని, పార్టీ సిద్ధాంతాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర మీడియా ఇన్‌చార్జి కిలారు దిలీప్, రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్, తెలుగు–సంస్కృత భాషా కార్పొరేషన్ చైర్మన్ ఆర్.డి. విల్సన్ కూడా హాజరయ్యారు.
More Stories
నిజ్జర్ హత్యకులారెన్స్ బిష్ణోయ్ ఆదేశం.. భారత్ ప్రమేయం లేదు!
హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల భద్రత పట్ల భారత్ ఆందోళన
అదానీ షాపుల్లో నికోటిన్ పౌచ్‌ల అమ్మకంపై దుమారం