సౌరబ్‌ గంగూలీ బీజేపీలో చేరేందుకు సిద్ధమా! 

మరో ఐదు నెలల్లో  జరుగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి మమతా బనెర్జీని ఓడించి, అధికారంలోకి రావడం కోసం ఉధృతంగా, వ్యూహాత్మకంగా బిజెపి అడుగులు వేస్తున్న సమయంలో టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు, బీసీసీఐ అధ్యక్షుడు‌ సౌరబ్‌ గంగూలీ రాజకీయ వర్గాలలో కలకలం రేపుతున్నారు.
బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ దన్‌కర్‌తో ఆయన ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో సమావేశం కావడంతో పాటుగా సోమవారం ఢిల్లీలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలవడంతో ఆయన బీజేపీలో చేరబోతున్నారని కొంతకాలంగా వస్తున్న కథనాలకు బలం చేకూరుతున్నది. అయితే ఈ విధాయమై బిజెపి వర్గాలు గాని, గంగూలీ సన్నిహితులు గాని పెదవి విప్పడం లేదు.
దిగవంత ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్ల్య్ 68వ జన్మదినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ లో ఆయన విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించిన కార్యక్రమంలో గంగూలీ ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు సమావేశమయ్యారు.
మరోవంక, కీలకమైన అసెంబ్లీ ఎన్నికల వేళ గవర్నర్‌తో దాదా భేటీ కావడంపై దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చసాగుతోంది. గంగూలీ రాజకీయ రంగ ప్రవేశంపై ఇది వరకే పలు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుఫున బెంగాల్‌ అసెంబ్లీకి దాదా పోటీ చేస్తారని, అతన్ని సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సైతం సాగింది.
ఒకవేళ గంగూలీ బరిలో నిలవకపోతే అతని భార్యను పోటీలో నిలపుతారని  వార్తలు సైతం వినిపించాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీని  ఎంపిక చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ తరుణంలోనే గవర్నర్‌తో భేటీ కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే రాష్ట్రంలోని రాజకీయ అంశాలపై ఇరువురు చర్చించారని వార్తలు రావడంతో ట్విటర్‌ వేదికగా గవర్నర్‌ స్పందించారు. తమ భేటీలో ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదని స్పష్టం చేశారు. ప్రతిష్టాత్మక ఈడెన్‌ గార్డెన్‌ మైదానాన్ని సందర్శించాల్సిందిగా గంగూలీ కోరినట్లు గవర్నర్‌ వివరించారు. దాదా కోరిక మేరకు త్వరలోనే ఈడెన్‌ను సందర్శిస్తానని పేర్కొన్నారు.