తిరువ‌నంత‌పురం  మేయర్ గా 21 ఏళ్ళ యువతి 

కేరళలో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన 21 ఏళ్ల ఆర్యా రాజేంద్రన్‌ తిరునవనంతపురం నగర కార్పొరేషన్‌ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 100 మంది ఉన్న సభ్యుల మండలిలో 54 ఓట్లు ఆమె సాధించడంతో మేయర్‌గా ఎన్నికయ్యారు. దీంతో ఇప్పటి వరకు మేయర్‌ పదవి అధిరోహించిన అతి చిన్న వయస్కురాలు ఆమె కావడం విశేషం. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డిఎఫ్‌)నుండి ముడవా ముంగళ్‌ వార్డుకు కౌన్సిలర్‌గా పోటీ చేసి ఆర్యా గెలుపొందారు.  
 
అతిచిన్న వ‌య‌సులో కార్పొరేట‌ర్‌గా గెలువ‌డంతోపాటే న‌గ‌ర మేయ‌ర్ ప‌ద‌విని కూడా ఆమె ద‌క్కించుకొని ఆమె రికార్డు సృష్టించారు. మ‌రో ముఖ్య విష‌యం ఏమిటంటే ఆర్య రాజేంద్ర‌న్ త‌న‌కు ఓటు హ‌క్కు వ‌చ్చిన త‌ర్వాత తొలిసారి తిరువ‌నంత‌పురం కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లోనే ఓటువేశారు. అదే ఎన్నిక‌ల్లో ప్ర‌జాప్ర‌తినిధిగా కూడా గెలిచి, మేయ‌ర్ పీఠం అధిష్ఠించారు.
 
తాజాగా సోమవారం మేయర్‌ పదవికి ఎన్నిక జరగ్గా….కౌన్సిల్‌లో 52 స్థానాలున్న ఎల్‌డిఎఫ్‌ పార్టీకి ఇద్దరు స్వతంత్రులు కూడా మద్దతు ఇవ్వడంతో ఆమె మెజార్టీ సాధించి..మేయర్‌గా ఎన్నికయ్యారు. 
 
ఎల్‌డీఎఫ్ కూట‌మి నుంచి మేయర్ ప‌ద‌వికి పోటీదారులుగా బరిలో దిగిన ఇద్దరు సీపీఎం నేతలు ఈ ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాల‌య్యారు. దాంతో స్థానిక నేత‌లు ఆర్య రాజేంద్రన్‌ పేరును తెరపైకి తెచ్చారు.  ఆమె తిరువనంతపురంలోని అల్‌ సెయింట్స్‌ కాలేజీలో బీఎస్సీ మ్యాథమెటిక్స్‌ సెకండియర్‌ చదువుతున్నారు. 
 
34 సీట్లు, స్వతంత్ర కౌన్సిలర్ల మద్దతు ఉన్న ప్రతిపక్ష బిజెపి మేయర్‌ పదవికి కోసం మాజీ కార్పొరేషన్‌ టాక్స్‌ అపీల్‌ స్టాండింగ్‌ కమిటీ మాజీ చైర్‌పర్సన్‌ సిమి జ్యోతిష్‌ను బరిలోకి దింపింది. పది స్థానాలున్న యునైటెడ్‌ ఫ్రంట్‌ కౌన్సిలర్‌ మేరీ పుష్పాన్ని ఎంపిక చేసింది. కాగా, బిజెపి అభ్యర్థి 35 ఓట్లు పడగా..యుడిఎఫ్‌ అభ్యర్థికి తొమ్మిది ఓట్లు వచ్చాయి. దీంతో ఎక్కువ ఓట్లు వచ్చిన ఆర్యా రాజేంద్రన్‌ నగర మేయర్‌గా ఎన్నికై..ప్రమాణ స్వీకారం చేశారు.