విశ్వభారతి భూముల కబ్జా జాబితాలో అమర్త్యసేన్

విశ్వకవి రవీంద్ర నాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి యూనివర్సిటీ భూములు కబ్జా అయ్యాయి. తమ వర్సిటీకి చెందిన అనేక ప్లాట్లను ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకున్నారంటూ విశ్వ భారతి ట్రస్ట్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ విజేత ప్రొఫెసర్ అమర్త్యసేన్ కూడా తమ ప్లాట్లను కబ్జా చేసినోళ్ల జాబితాలో ఉన్నారని ట్రస్ట్ ఆరోపించింది.

వర్సిటీలోని గర్ల్స్ హాస్టల్, అకడమిక్ డిపార్ట్ మెంట్ ఆఫీస్, చివరికి వీసీ అఫీషియల్ బంగ్లాకు చెందిన ప్లాట్లను కూడా తప్పుగా రికార్డుల్లో చేర్చారని పేర్కొంది. ప్రభుత్వం ఆర్ వోఆర్ లో యాజమాన్యంను తప్పుగా నమోదు చేసిందని,  విశ్వవిద్యాలయం అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేసినదని వివరించింది. స్వయంగా రవీంద్ర నాథ్ ఠాగూర్ కొనుగోలు చేసిన ఆ భూముల్లో ప్రైవేట్ వ్యక్తులు రెస్టారెంట్లు, స్కూళ్లు, షాపులు ఏర్పాటు చేసుకున్నారని తెలిపింది. 

విశ్వభారతి నుంచి అమర్త్యసేన్ తండ్రి125 సెంట్ల భూమిని లీజ్ కు తీసుకున్నారని, కానీ అమర్త్యసేన్ దానికి అదనంగా 13 సెంట్ల భూమిని ఆక్రమించారని పేర్కొంది. అయితే ఈ  జాబితాలో తన పేరుండడం పట్ల అమర్త్యసేన్  విస్మయం వ్యక్తం చేశారు.  

‘‘కబ్జాదారుల జాబితాలో నా పేరూ ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వ భారతి భూమిలో మా ఇల్లు ఉన్నది నిజమే. కానీ ఆ భూమి లీజ్ ఇంకా చాలాకాలం ఉంది” అంటూ తెలిపారు. పైగా, ‘విశ్వ భారతి క్యాంపస్ లోని లీజ్డ్ ల్యాండ్ లో అక్రమంగా పాగా వేసినవారిని ఖాళీ చేయించడంలో వైస్ చాన్స్ లర్ బిద్యుత్ చక్రబర్తి బిజీగా ఉన్నారని అంటూ ఎద్దేవా చేశారు. 

కాగా, రవీంద్రనాథ్ ఠాగూర్ కొడుకు రతీంద్రనాథ్ వర్సిటీ భూముల్లో ఇండ్లు కట్టుకునేందుకు ప్రముఖ వ్యక్తులకు గతంలో 99 ఏళ్ల లీజుకు ఇచ్చారని వర్సిటీ అధికారులు చెప్పారు. చాలా మంది ఆ ప్లాట్లతో పాటు వర్సిటీ భూములను ఆక్రమించుకున్నారని తెలిపారు.