బెంగాల్ ను నాశనం చేస్తున్న మమతా విధానాలు 

ముఖ్యమంత్రి మమత బెనర్జీ భావజాలం పశ్చిమ బెంగాల్‌ను నాశనం చేసిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఆమె అనుసరిస్తున్న రైతు వ్యతిరేక చర్యలు తనకు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ అంశంపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రతిపక్షాలను నిలదీశారు.   

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధిదారులకు రూ.18 వేల కోట్లు విడుదల చేసిన అనంతరం రైతులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మోదీ  మాట్లాడుతూ  పశ్చిమ బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని అనుమతించాయని గుర్తు చేశారురు. దాదాపు 70 లక్షల మంది పశ్చిమ బెంగాల్ రైతులు ఈ పథకం ప్రయోజనాలను పొందలేకపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. 

ఈ పథకాన్ని బెంగాల్ లో అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదని ప్రధాని ధ్వజమెత్తారు.  సీఎం మమతా బెనర్జీ విధానాలన్నీ బెంగాల్‌ను విధ్వంసం చేసేలా ఉన్నాయని, ఆమె విధానాలన్నీ రైతు వ్యతిరేక విధానాలని దుయ్యబట్టారు. రైతులకు ఎలాంటి లాభాలు అందకుండా మమత బెనర్జీ చేస్తున్నారని మోదీ ఆరోపించారు. 

రైతులకు సంబంధించిన విధానాల్లో అవినీతిని జాతీయ వ్యాధిగా మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి అభివర్ణించారని తెలిపారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం క్రింద లబ్ధిదారులకు రూ.1.10 లక్షల కోట్లు అందజేసినట్లు తెలిపారు. ఈ పథకంలో లోపాలు లేకుండా టెక్నాలజీ సహాయంతో జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ పథకం క్రింద దేశవ్యాప్తంగా రైతులు లబ్ధి పొందుతుండటం సంతోషకరమని చెప్పారు.

 కొన్ని ప్రతిపక్ష పార్టీలు పంజాబ్ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని, ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నాయని దుయ్యబట్టారు.  పంజాబ్ రైతులను తప్పుదోవపట్టించడానికి ఈ పార్టీలకు కావలసినంత సమయం ఉంటుందని, కేరళలో మార్కెట్ కమిటీల వ్యవస్థను ఏర్పాటు చేయడానికి సమయం ఉండదని ఎద్దేవా చేశారు. ద్వంద్వ ప్రమాణాలను ఎందుకు పాటిస్తున్నారని ప్రశ్నించారు.