బీజేపీ అధికారంలోకి వస్తే జూరాల లిఫ్ట్ చేబడతాం 

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే జూరాల నుంచి ఎత్తిపోతల పథకం చేపడతామని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నారాయణపేట బహిరంగ సభలో ప్రకటించారు.  జూరాల ప్రాజెక్టు నుంచే కృష్ణా నీళ్లను ఎత్తిపోయాలనే ఉద్యమం ఊపందుకుంది. దీనిపై మహబూబ్‌‌నగర్‌‌ పశ్చిమ ప్రాంతంలో జలసాధన సమితి సదస్సులు, రౌండ్‌‌ టేబుల్‌‌ సమావేశాలు నిర్వహిస్తోంది. రూ.18 వేల కోట్లతో రెండు స్టేజీల్లో ఎత్తిపోతలతో 7 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని కోరుతోంది. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో జూరాల ఫోర్‌‌ షోర్‌‌ నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసి మహబూబ్‌‌నగర్‌‌, రంగారెడ్డి జిల్లాల్లోని 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు సర్వే పూర్తి చేశారు. కిరణ్‌‌కుమార్‌‌ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడ్డాక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సోర్స్‌‌ను జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు మార్చారు. 

జూరాల నుంచి 45 రోజుల్లో 90 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని ప్రతిపాదించగా శ్రీశైలానికి మార్చిన తర్వాత 60 రోజుల్లో 120 టీఎంసీలు ఎత్తిపోసేలా ప్రతిపాదనలు మార్చారు. 2015లోనే ఈ ప్రాజెక్టుకు పునాది రాయి పడినా ఇంకా 30 శాతం పనులు కూడా పూర్తవలేదు. 

ప్రాజెక్టును రెండు టీఎంసీల నుంచి ఒక టీఎంసీకి మార్చడంతో ఎగువ ప్రాంతాలకు ప్రాజెక్టు ద్వారా  నీళ్లు అందే అవకాశం లేకుండా పోయిందని జలసాధన సమితి బాధ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మక్తల్‌‌, నారాయణపేట్‌‌, దేవరకద్ర, మహబూబ్‌‌నగర్‌‌, కొడంగల్‌‌, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లోని 7 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వొచ్చన్నారు. శ్రీశైలంలో నీటి లభ్యత తగ్గుతోంది

శ్రీశైలం రిజర్వాయర్‌‌పై తెలంగాణ సర్కారు కల్వకుర్తి లిఫ్ట్‌‌ స్కీం కట్టగా పాలమూరు రంగారెడ్డి, ఎస్‌‌ఎల్బీసీ టన్నెల్‌‌ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నాయి. ఏపీ ప్రభుత్వమేమో పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ కెపాసిటీని డబుల్‌‌ చేసే ప్రయత్నాల్లో ఉంది. అప్పుడు తెలంగాణ ప్రాజెక్టులకు నీళ్లు అందడం అసాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో జూరాల నుంచి నీటి తరలింపు అనివార్యమని జలసాధన సమితి డిమాండ్‌‌ చేస్తోంది.

ఏపీ సర్కారు సంగమేశ్వరం లిఫ్ట్‌‌ పూర్తి చేస్తే దక్షిణ తెలంగాణకు నీళ్లు రావు. ఏపీతో ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న శ్రీశైలం నుంచి కాకుండా తెలంగాణ భూభాగంలో ఉన్న జూరాల నుంచే నీటిని లిఫ్ట్‌‌ చేయాలని జలసాధన సమితి అధ్యక్షుడు అనంత రెడ్డి డిమాండ్ చేశారు.  రోజుకు నాలుగైదు టీఎంసీ వరకు ఇక్కడి నుంచి లిఫ్ట్‌‌ చేసుకునే అవకాశమున్నా సర్కారు నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.

జలసాధన సమితి ఆధ్వర్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను కలిసి జూరాల నుంచి పాలమూరు ఫేజ్‌‌–-1 చేపట్టాలని కోరాం. కాంగ్రెస్‌‌, బీజేపీ సహా అన్ని పార్టీలు రౌండ్‌‌ టేబుల్‌‌ సమావేశాల్లో పాల్గొంటున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా జూరాల లిఫ్ట్‌‌ పనులు మొదలు పెట్టాలని వత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.