రామమందిర నిర్మాణానికి విరాళాలివ్వండి

 అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా విరాళాలు సేకరిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్‌ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్‌కుమార్‌ తెలిపారు. రామభక్తులంతా విరాళాలివ్వాలని కోరారు. 

బుధవారం హైదరాబాద్ లోని కత్రియ హోటల్‌లో నిర్వహించిన వీహెచ్‌పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ  రాష్ట్రంలోని 9వేల గ్రామాల్లో 40 లక్షల కుటుంబాల నుంచి విరాళాలు సేకరిస్తున్నామని తెలిపారు.

ఇందుకోసం రూ.10, రూ.100, రూ.1000 కూపన్లను ముద్రించినట్లు చెప్పారు. రూ.2 వేలు, ఆ పైన ఇచ్చే విరాళాలకు రశీదు ఇస్తామని పేర్కొన్నారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27 వరకు నిధుల సమీకరణ చేస్తామని ప్రకటించారు. 

ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే, న్యాయవాది రఘునందన్‌రావు క్లయింట్‌ మంతెన రామకృష్ణంరాజు రూ.1 కోటి 116 విరాళంగా ప్రకటించారు. ఆయన తరపున చెక్కును రఘునందన్‌, వీహెచ్‌పీ ప్రతినిధులకు అందజేశారు. ఆయనతోపాటు నరేడ్‌ కుటుంబం రూ.11 లక్షలు, రాజ్‌కుమార్‌ రూ.5 లక్షలు, సామ్రాజ్యలక్ష్మి రూ.లక్ష, అనూషరెడ్డి రూ.లక్ష విరాళంగా అందించినట్లు వీహెచ్‌పీ రాష్ట్ర అధికార ప్రతినిధి జి.వెంకటేశ్వరరాజు తెలిపారు.