గోవధపై కేసీఆర్ స్పందించాలి 

గోవధపై కేసీఆర్ స్పందించాలి 
తెలంగాణలో గోవధపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.   గోవధపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. 
 
గోవులు హిందువుల ఆరాధ్య దైవం అని, గోవులను వధిస్తే చూస్తూ ఊరుకోబోమని  సంజయ్ హెచ్చరించారు. రాష్ట్రంలో పోలీసులు చేయలేని పనిని బిజెపి ఎమ్యెల్యే రాజాసింగ్ చేసి చూపిస్తున్నారని సంజయ్ కొనియాడారు. యజ్ఞ యాగాలు చేసే సీఎం కేసీఆర్.. గోవధపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
 
కాగా, గోవధపై ఫిర్యాదు చేసినందుకు బీజేపీ అనుబంధ విభాగాలపై పోలీసులు  కేసులు పెడుతూ ఉండడం పట్ల సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమోషన్ల కోసం కొంత మంది పోలీస్ అధికారులు ముఖ్యమంత్రికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. 
 
తాము పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదన్న ఆయన  ప్రభుత్వానికి తొత్తులుగా మారిన పోలీసులకు మాత్రమే వ్యతిరేకం అని స్పష్టం చేశారు. కిందస్థాయిలో జరుగుతోన్న విషయాలను పోలీస్ అధికారులు తెలుసుకోవాలని ఎంపీ సూచించారు. ఇదే సమయంలో జీహెచ్ఎంసీ కొత్త పాలకవర్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. మేయర్‌ను ఏర్పాటు చేసే బలం తమకు లేదని, గ్రేటర్ లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని సంజయ్ స్పష్టం చేశారు.