బలోచిస్థాన్ ఉద్యమకారిణి కెనడాలో హత్య

బలోచిస్థాన్ నరమేథం, యుద్ధ నేరాలపై అంతర్జాతీయ వేదికలపై ఎలుగెత్తి ఖండించిన బలోచిస్థాన్ ఉద్యమ కారిణి కరీమా బలోచ్‌ను కెనడా లోని టొరంటో నగరంలో మంగళవారం దారుణంగా హత్య చేశారు. టోరంటో లోని లేక్‌షోర్ సమీపాన ఆమె మృతదేహాన్ని ఆమె భర్త హమాల్ హైడెర్, సోదరుడు గుర్తించ గలిగారు. 

ఆదివారం సాయంత్రం 3 గంటల నుంచి ఆమె అదృశ్యమైంది. పాక్ పాలనలోని బలోచిస్థాన్ నుంచి 2016 లో ఆమె తప్పించుకుని కెనడాలో శరణార్థిగా ఉంటున్నారు. ఆమె మృతికి సంతాపంగా 40 రోజులు సంతాప దినాలు పాటించాలని బలోచ్ నేషనల్ మూవ్‌మెంట్ పిలుపునిచ్చింది. ఈ హత్య వెనుక పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. 

కెనడాలో స్థిరపడిన పాక్ జనరల్స్‌ను కరీమా తీవ్రంగా విమర్శించారు. 2016 లో బిబిసి ప్రచురించిన వందమంది అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో కరీమా కూడా చోటు దక్కించుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ  2016 లో స్వాతంత్య్ర దినోత్సవం రోజున బలోచ్ అంశాన్ని కూడా తన ప్రసంగంలో ప్రస్తావించారు.

ఇది జరిగిన వారం తర్వాత కరీమా నుంచి సందేశం వచ్చింది. ‘నిన్ను మా సోదరుడిగా భావించి సాయం అడుగుతున్నాం. మా ప్రాంతంలో జరుగుతున్న నరమేథం, యుద్ధ నేరాలపై అంతర్జాతీయ వేదికలపై బలోచ్ చెల్లెళ్ల గొంతుకగా మీరు మారాలి. మేం ఈ పోరాటాన్ని సొంతంగానే కొనసాగిస్తాం. మీరు కేవలం మా ఆవేదనను ప్రపంచానికి తెలియచేయండి’ ఇది కరోమా సందేశ సారాంశం. 

ఇది 2016 లో రక్షాబంధన్ రోజున మోదీకి అందింది. ఆనాటి బలోచ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఛైర్‌పర్శన్ కరీమా బలోచ్ దీన్ని రికార్డు చేసి తారేక్ ఫతా అనే కెనడా రచయిత యూ ట్యూబ్ ఛానల్‌లో పెట్టారు. అప్పట్లో ఇది సంచలనం కలిగించింది. బలోచ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్‌కు మొదటి ఛైర్‌పర్శన్ అయిన ఆమె 2014లో ఆ సంస్థ నేత జహీద్ బలోచ్ కిడ్నాప్‌కు గురైన తరువాత సంస్థకు నాయకత్వం వహించారు. 

ఇది ఉగ్రవాద సంస్థగా పాక్ ప్రభుత్వం ఆరోపించి 2013 మార్చి 15న నిషేధించింది. ఆమె కెనడాకు రాక ముందు అనేక సార్లు పాక్ మిలిటరీ దాడుల నుంచి తప్పించుకుంది. ఏడాది పాటు అజ్ఞాత వాసం గడిపింది. డిసెంబర్ 14న కరీమా తన ట్విటర్ హ్యాండిల్‌లో చివరి సారి ట్వీట్ చేశారు.

బలోచ్ ఉద్యమ కారులను రక్షించాలని ఆమె కోరారు. పాక్ సైన్యం తమ వారిని కిడ్నాప్ చేసి హత్యలు సాగిస్తోందని ఆమె పేర్కొంది. బలోచ్ ఉద్యమ కారులు హత్యలకు గురి కావడం ఇదే తొలిసారి కాదు. మే లో బలోచ్ జర్నలిస్టు సాజిద్ హుస్సేన్‌ను స్వీడన్‌లో పాక్ కిరాయి మూకలు హత్య చేశాయి.

బలోచిస్థాన్‌లో పాక్ క్రూరత్వం విచ్చల విడిగా సాగుతోంది. ఉగ్రసంస్థ లష్కరే తోయిబా సహకారంతో బలోచ్ ఉద్యమకారులను, పౌరులను హత్యలు చేస్తున్నారు. పక్కా నేరగాళ్లను ఎందుకొని ఐఎస్‌ఐ బృందాలను తయారు చేసి హత్యలకు పూనుకుంటోంది. ఈ డెత్‌స్కాడ్ నిర్వాహకులు తరువాత రాజకీయాల్లోకి వస్తున్నారు.

పాక్ డెత్‌స్కాడ్‌ల్లో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి షపీక్ మెంగల్ కు లష్కరే, కశ్మీర్ జీహాదీలతో సంబంధాలు ఉన్నాయి. పాక్ లోని ఖుజుదార్ అనే ప్రదేశంలో ప్రైవేట్ జైళ్లను నడిపే వాడు. 2014 లో టూటక్ అనే ప్రదేశం వద్ద నడిపే ప్రైవేట్ జైలు సమీపంలో సామూహిక సమాధులు బయటపడ్డాయి. వాధ్‌లో ఉగ్రక్యాంపులను కూడా నిర్వహిస్తుంటాడు.

వీరితోపాటు ఫయాజ్ జంగ్వీ, యూనిస్ మహమ్మద్ కూడా డెత్‌స్కాడ్‌లను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే బలోచిస్థాన్‌లో 45 కిడ్నాప్‌లు జరిగాయి. వీటి వెనుక వీరి హస్తం ఉంది. గత ఏడాది పాక్ లోని జియో టీవీ కి చెందిన హమీద్ మీర్ అనే జర్నలిస్టును సైన్యం మాయం చేసింది.